తెలంగాణ : పది పరీక్షలు రద్దు ...ఇంటర్ ఎగ్సామ్స్ వాయిదా!

     Written by : smtv Desk | Thu, Apr 15, 2021, 07:11 PM

తెలంగాణ : పది పరీక్షలు రద్దు ...ఇంటర్ ఎగ్సామ్స్ వాయిదా!

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైరస్ తీవ్రత వేళ రాష్ట్రంలో కూడా పరీక్షలను రద్దు చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేస్తూ.. రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖ మంత్రి పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం.

పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో పరీక్షల వాయిదాపై సమాలోచనలు చేశారు.

రాష్ట్రంలో 5 లక్షల 35 వేల మంది పదో తరగతి చదివే విద్యార్థులు ఉన్నారు. కాగా, వీరందరినీ పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థులకు కరోనా ఉధృతి తగ్గాక వీరికి పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇది వరకే ప్రకటించిన ప్రవేశ పరీక్షల తేదీలు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు, ఇంటర్ బోర్డు ఆన్ లైన్ తరగతులు, పని దినాలను ఈ నెల 30 వరకూ పొడిగించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఇంటర్ పని దినాలు, ఆన్ లైన్ తరగతులు ఇవాల్టితో ముగియనున్నాయి.





Untitled Document
Advertisements