ఆర్టీజీఎస్ సేవలకు అంతరాయం....14 గంటలు బంద్

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 01:06 PM

ఆర్టీజీఎస్ సేవలకు అంతరాయం....14 గంటలు బంద్

ఏప్రిల్ 17 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం ఏప్రిల్ 18 మధ్యాహ్నం 2 గంటల వరకు 14 గంటలపాటు తాత్కాలికంగా ఆర్టీజీఎస్ సేవలు నిలిచిపోనున్నాయని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. తక్షణ నగదు బదిలీ వ్యవస్థ ఆర్టీజీఎస్ సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. శనివారం (ఏప్రిల్ 17) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం 2 గంటల వరకు.. 14 గంటలపాటు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. ఆర్టీజీఎస్ వ్యవస్థ అప్‌గ్రేడ్ వల్ల ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు వివరించింది.

ముఖ్యంగా డిజాస్టర్‌ రికవరీ టైమ్‌ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఆర్‌టీజీఎస్‌ సేవలకు అంతరాయం ఏర్పడినా.. నెఫ్ట్ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయం గురించి తమ కస్టమర్లకు ఆయా బ్యాంకులు సమాచారం అందజేయాలని సూచించింది. దీనివల్ల నగదు చెల్లింపులను ప్లాన్ చేసుకుంటారని పేర్కొంది. అంతేకాదు, నెఫ్ట్ సేవలను ఆ సమయంలో సద్వినియోగం చేసుకోవాలని వివరించింది. ఇక, 2020 డిసెంబర్ 14 నుంచి ఆర్టీజీఎస్ సేవలు 24 గంటలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఆర్టీజీఎస్, నెఫ్ట్ సేవలు బ్యాంకు డిజిటల్ లావాదేవీలు. వీటి ద్వారా నగదు చెల్లింపులు డిజిటల్ విధానంలో జరుగుతాయి. అయితే, ఈ రెండింటికీ కొంత వ్యత్యాసం ఉంది. ఆర్టీజీఎస్‌ను పెద్ద మొత్తంలో నగదు చెల్లింపులకు మాత్రమే వినియోగిస్తారు. ఈ సేవల ద్వారా రూ.2 లక్షలకుపైగా నగదు చెల్లింపులు చేయవచ్చు. నెఫ్ట్‌కు మాత్రం అటువంటి పరిమితి లేదు. రూ.2 లక్షలలోపు నగదు చెల్లింపులను దీని ద్వారా జరపుకోవచ్చు. అంతేకాదు, రూ.25 లక్షల వరకూ నెఫ్ట్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. నెట్‌బ్యాంకింగ్‌, వ్యాలెట్ల వాడకం సులువుగా ఉండటంతో 2020లో వాటి వినియోగం 120శాతం పెరిగినట్లు ఓ సర్వేలో వెల్లడయ్యింది.





Untitled Document
Advertisements