తెలంగాణ : 24 గంటల్లో 3840 పాజిటివ్ కేసులు...!

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 01:09 PM

తెలంగాణ : 24 గంటల్లో 3840 పాజిటివ్ కేసులు...!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నిన్న రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 3,840 మందికి పాజిటివ్‌ తేలినట్లు తెలిపింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 505 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 407, రంగారెడ్డి జిల్లాలో 302, నిజామాబాద్‌‌లో 303, సంగారెడ్డిలో 175, జగిత్యాలలో 167, కామారెడ్డిలో 144, కరీంనగర్‌లో 124, ఖమ్మంలో 111, మహబూబ్‌నగర్ జిల్లాలో 124, మంచిర్యాలలో 101, నల్లగొండ జిల్లా లో 116, నిర్మల్ జిల్లాలో 159, వరంగల్ అర్బన్ జిల్లా లో 114 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తాజాగా 1198 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా.. 9 మంది బలి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30,494కి చేరుకోగా.. 20,215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.52 శాతంగా ఉండగా.. రికవరీ రేటు మాత్రం 90.55 శాతంగా ఉంది. రికవరీ రేటు తగ్గుతుండటం ప్రభుత్వ వర్గాల్లో కలవరం పెంచుతోంది. కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో బెడ్ల కొరత మొదలైంది. సినిమా థియేటర్ల మాదిరి ప్రైవేట్ ఆస్పత్రుల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.





Untitled Document
Advertisements