24 గంటల్లో కరోనాకి 1,184 మంది బలి

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 02:35 PM

24 గంటల్లో కరోనాకి 1,184 మంది బలి

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి భయంకరంగా ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నిర్ధారణ అవుతున్నాయి. పాజిటివ్ కేసులు బుధవారం 2 లక్షల మార్క్ అందుకోగా.. గురువారం ఈ సంఖ్యను దాటేసింది. ముందు రోజుతో పోల్చితే దాదాపు 9 శాతం మేర పెరుగుదల నమోదయ్యింది. దేశవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 2.16 లక్షల కొత్త కేసులు నిర్దారణ అయ్యాయి. కోవిడ్ మరణాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో మహమ్మారికి 1,184 మంది బలయ్యారు.

గతేడాది సెప్టెంబరు 18 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కరోనాతో ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దేశంలో యాక్టివ్ కేసులు గురువారం నాటికి 1.5 మిలియన్ (15 లక్షలు) మార్క్ దాటేశాయి. ఏప్రిల్‌లో వైరస్ ఉద్ధృతి అసాధారణంగా ఉంది. యాక్టివ్ కేసులు రెండున్నర రెట్లు మేర పెరిగాయి. మార్చి 31న నాటికి ఆరు లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. ఏప్రిల్ 15కి 15 లక్షలకు చేరాయి. యాక్టివ్ కేసులు పెరుగుదల దేశంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం, మరణాల తీవ్రతకు అద్దం పడుతోంది.

గురువారం 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. ఇటు, మహారాష్ట్రలో 61,695 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. అక్కడ నమోదయిన రోజువారీ కేసుల్లో రెండో అత్యధికం ఇదే. దేశవ్యాప్తంగా 2,16,902 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. తొలి దశలో కేసులు గరిష్ఠ స్థాయికి చేరిన సమయం టోల్‌ల కంటే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మరణాలు పెరుగుతున్నాయి.

100కిపైగా కోవిడ్ మరణాలు నాలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో 349, చత్తీస్‌గఢ్‌లో 135, ఢిల్లీలో 112, ఉత్తర్ ప్రదేశ్‌లో 104 మంది కోవిడ్-19కు బలయ్యారు. గుజరాత్‌లో 81 మంది, కర్ణాటకలో 66, మధ్యప్రదేశ్ 53 మందికి చనిపోయారు. పంజాబ్‌లో 51 మంది ప్రాణాలు కోల్పోగా.. దేశ సగటుతో పోల్చితే ఇది అత్యధికం. కోవిడ్ మరణాల్లో జాతీయ సగటు 1.22 శాతం కాగా, పంజాబ్‌లో ఇది 2.7 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో 22,439 కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో రోజువారీ కేసులు యూపీలోనే నిర్ధారణ అయ్యాయి. చత్తీస్‌గఢ్‌లో 15,256, ఢిల్లీలో 16,699 కేసులు బయటపడ్డాయి. ముందు రోజుతో పోల్చితే కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. కర్ణాటకలో 14,738, కేరళలో 8,126, తమిళనాడు 7,987 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.





Untitled Document
Advertisements