కుంకుమ ఎందుకు ధరించాలి? ప్రయోజనాలు ఏమిటి?

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 04:11 PM

కుంకుమ ఎందుకు ధరించాలి? ప్రయోజనాలు ఏమిటి?

సర్వ సాధారణంగా గృహస్తులు స్నానం చేసిన వెంటనే స్త్రీలు కుంకుమ, పురుషులు విభూతిని ధరించడం అలవాటు. కుంకుమ, విభూతి, సింధూరం, శ్రీ చూర్ణం, శ్రీ చందనం ఎదో ఒకటి ధరించే అలవాటు ప్రతి ఒక్కరికి దాదాపు ఉంటుంది. మనం ధరించే ఈ బొట్టు కనుబొమ్మల మధ్యభాగంలో జ్ఞాపకశక్తికి, ఆలోచనాశక్తికి స్తానమైన చోట ఉండడం వలన ఆజ్ఞాచక్రం ప్రేరేపిస్తుందని, కర్తవ్య భోధ చేస్తుందనీ, పేద ధోరణుల నుంచి, దుష్టశక్తుల నుంచి మనల్ని కాపాడుతుందని నమ్మకం. వీటిని భగవంతుని దగ్గరి నుండీ గ్రహించి ధరించినప్పుడు అందం, ఆనందంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా లభిస్తాయి.
యోగశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో వేల సంఖ్యలో నాడులుంటాయి. ప్రాణశక్తిని ప్రవహింపజేసే ఈ అదృశ్య నాడులకు కేంద్రస్థానం నుదుటి భాగం. కనుబొమ్మల మధ్య గల భాగం. మానవ శరీరంలో ముఖ్యంగా ఫలభాగం విద్యుత్అయస్కాంత తరంగాల రూపంలో శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. అమితంగా ఆందోళన చెందినప్పుడు వేడి విడుదల అయ్యి తలనొప్పి వస్తుంది. ఆ శక్తి వృదాకాకుండా ఆపే శక్తి మనం ధరించే విభుతి, కుంకుమ, గోపీచందనం లాంటి వాటికి ఉంది. అందుకే కనుబొమ్మల మధ్య భాగంలో తిలకధారణ చేయాలి. అప్పుడే నుదురు చల్లబడుతుంది. ఆడవాళ్లు ప్రస్తుతం ఉపయోగించే స్టిక్కర్ల వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. పైగా మచ్చపది చర్మ వ్యాధిగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే సహజ సిద్దమైన వాటిని మాత్రమే తిలక ధారణ చేయాలి. నిలువు, అడ్డంగా ఏ విధంగా ధరించినా తిలకం ధరించడం ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా చాలా మంచిది.
ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ధ్యానిస్తూ భస్మధారణ చేయాలి. విభూతిని ధరించడం వల్ల శాంతి స్వభావం అలవడుతుందని యోగులు, సన్యాసులు దీన్ని ధరిస్తారు. తెలుపు రంగులో ఉండే విభూతి నిర్మలత్వానికి సూచిక, జాతి, మత, కుల వర్ణ బేధాలతో సంబంధం లేకుండా ఎవరైనా విభూతిని ధరించవచ్చు. విభూతిని భ్రూమధ్యలో ధరిస్తే వేదాధ్యయన ఫలితం, గంగా, యమునా, సరస్వతులనే మూడు నదుల పుష్కరిణిలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది. విభూతి ధరించిన వ్యక్తిని సాక్షాత్తు రుద్ర స్వరుపుడిగా భావిస్తారు. విభూతి ధరించడం వలన సకల పీడలు అంతరిస్తాయి అని చెపుతోంది శివ పురాణం. ప్రజలు భక్తితో విభూతి ధరిస్తే దారిద్ర్య నిర్మూలన జరిగి సర్వ సౌభాగ్యాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక రీత్యా, ఆరోగ్యా రీత్యా కూడా ఈ విభూతి ధారణ చాల మంచిది. శరీరానికి కావలసిన వేడి ఒకే విధంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో చెమట వల్ల వచ్చే రోగాలు, చర్మ రోగాలు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. విభూతి పెట్టుకోవడం వల్ల రక్తంలోని దోషాలు పోయి, రక్త ప్రసారం సరిగా అవుతుంది, ఆయువు వృద్ది అవుతుంది.
ఇక కుంకుమ , కుంకుమ ఉంగరం వేలుతో పెట్టుకోవాలని చెప్తోంది శాస్త్రం. సర్వవిధి శుభాలు, సర్వాభీష్టాలను నెరవేర్చి నన్ను రక్షించు తల్లీ అంటూ ప్రార్ధిస్తూ ధరించాలి. దేవీ ప్రసాదమైన కుంకుమా కార్యసిద్దికి దోహదకారి, పుజార్హమైనది. మగవాళ్ళకు ఊర్ద్వపుండ్ర, విభూతి ధారణ ఎంత ముఖ్యమో, ఆడవాళ్ళకు కుంకుమ ధారణ సుమంగళకు ముఖ్యం. పురుషులు కూడా కుంకుమ ధారణ చేయవచ్చు. కుంకుమ సర్వశ్రేష్టం. దేవతరాధనకు ఉపయోగించిన కుంకుమనే ధరించాలి.
అనారోగ్యంతో భాదపడుతున్న వాళ్ళు, స్నానం చేయలేని పరిస్థితిలో ఉన్నచ్వారు విభూతిని రాసుకుని తలపై, నుదుటిపై కొన్ని నీళ్ళు చల్లుకున్న పవిత్రులవుతారని , అంతటి మహిమ గల విభూతిరాసుకుంటే కలుగుతుందని చెప్తోంది శాస్త్రం. మరి మనమెందుకు మన సంప్రదాయాలు పాటించకూడదు ?





Untitled Document
Advertisements