బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ ...A+ గ్రేడ్‌లో కోహ్లీ, రోహిత్, బుమ్రా

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 06:36 PM

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ ...A+ గ్రేడ్‌లో కోహ్లీ, రోహిత్, బుమ్రా

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020-2021కి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌ని గురువారం విడుదల చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రాకి ఎ+ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కగా.. వీరికి ఏడాదికి రూ. 7 కోట్లని బీసీసీఐ చెల్లించనుంది. వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ ఈ ముగ్గురు ఆటగాళ్లు రెగ్యులర్‌గా ఆడుతుండటంతో ఈ గ్రేడ్ దక్కినట్లు తెలుస్తోంది. 2020, సెప్టెంబరు నుంచి 2021 సెప్టెంబరు మధ్యకాలానికి సంబంధించిన కాంట్రాక్ట్‌ ఇది.

ఎ గ్రేడ్ కాంట్రాక్ట్‌లో 10 మంది ఆటగాళ్లకి చోటు దక్కింది. ఇందులో అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.5 కోట్లని బీసీసీఐ చెల్లించనుంది.

బి గ్రేడ్‌ కాంట్రాక్ట్‌లో టెస్టు టీమ్ వికెట్ కీపర్ సాహా, ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్ధూల్ ఠాకూర్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. వీరికి ఏడాదికి రూ. 3 కోట్లకి బీసీసీఐ చెల్లించనుంది.

సి గ్రేడ్‌లో కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, శుభమన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, చాహల్, మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నారు. వీరికి రూ.1 కోటిని బీసీసీఐ చెల్లించనుంది. మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌కి ఈ కాంట్రాక్ట్స్‌లో చోటు దక్కలేదు.





Untitled Document
Advertisements