ఐపీఎల్ 2021లో బోణి కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 11:51 AM

ఐపీఎల్ 2021లో బోణి కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కొట్టింది. పంజాబ్ కింగ్స్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటిన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజాగా సీజన్‌లో రెండో మ్యాచ్‌ ఆడిన చెన్నైకి ఇదే మొదటి విజయంకాగా.. పంజాబ్‌కి ఇదే తొలి ఓటమి.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్.. 8 వికెట్ల నష్టానికి 106 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో యువ హిట్టర్ షారూక్ ఖాన్ (47: 36 బంతుల్లో 4x4, 2x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 4/13 కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేయగా.. శామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావోకి తలో వికెట్ దక్కింది. కేఎల్ రాహుల్ రనౌట్‌గా వెనుదిరిగాడు.

107 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5) ఫెయిలైనా.. మరో ఓపెనర్ డుప్లెసిస్‌ (36 నాటౌట్: 33 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి మొయిన్ అలీ (46: 31 బంతుల్లో 7x4, 1x6) దూకుడుగా ఆడేశాడు. రెండో వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మొయిన్ అలీ టీమ్ స్కోరు 90 వద్ద ఔటైపోయాడు. అప్పటికే మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతిలోకి వచ్చేసినా. సురేశ్ రైనా (8: 9 బంతుల్లో 1x4), అంబటి రాయుడు (0) మ్యాచ్‌ని వేగంగా ఫినిష్ చేసేందుకు భారీ షాట్ ఆడి వికెట్లు చేజార్చుకున్నారు. అయితే.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన శామ్ కరన్ (5 నాటౌట్: 4 బంతుల్లో 1x4) బౌండరీతో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే 107/4తో చెన్నై ఛేదించింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు మయాక్ అగర్వాల్ (0), కేఎల్ రాహుల్ (5) మూడు ఓవర్లలోపే పెవిలియన్‌కి చేరిపోగా.. హిట్టర్లు క్రిస్‌గేల్ (10: 10 బంతుల్లో 2x4), దీపక్ హుడా (10: 15 బంతుల్లో 1x4) దీపక్ చాహర్ స్లో బంతుల్ని అర్థం చేసుకోలేక సులువైన క్యాచ్‌లు ఇచ్చేశారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (0: 2 బంతుల్లో ) కూడా చాహర్ బౌలింగ్‌లో ఔటైపోవడంతో పంజాబ్ టీమ్ 6.2 ఓవర్లు ముగిసే సమయానికి 26/5తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

ఈ దశలో జై రిచర్డ్‌సన్ (15: 22 బంతుల్లో 2x4)తో కలిసి ఓపికగా ఆడిన షారూక్ ఖాన్.. ఆరో వికెట్‌కి 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ.. టీమ్ స్కోరు 57 వద్ద రిచర్డ్‌సన్‌ని ఔట్ చేసిన మొయిన్ అలీ.. షారూక్ ఖాన్‌ని ఒత్తిడిలోకి నెట్టేశాడు. మురగన్ అశ్విన్ (6: 14 బంతుల్లో), మహ్మద్ షమీ (9: 12 బంతుల్లో) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోగా.. చివరి ఓవర్ వరకూ క్రీజులో నిలిచిన షారూక్ ఖాన్‌ హాఫ్ సెంచరీ ముంగిట ఔటైపోయాడు. దాంతో.. పంజాబ్ 106 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ ఛేసిన పంజాబ్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements