దీక్షలో మాస్క్ లేకుండానే షర్మిల....అనుచరులకు కరోనా

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 12:36 PM

దీక్షలో మాస్క్ లేకుండానే షర్మిల....అనుచరులకు కరోనా

వైఎస్ షర్మిల నిరుద్యోగులకు మద్దతుగా ఉద్యోగ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆమె మొదటి రోజు దీక్షను ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో చేపట్టారు. ఆ తర్వాత అక్కడ దీక్ష నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆమె లోటస్‌ పాండ్‌లో తన దీక్షను కొనసాగిస్తున్నారు. ష‌ర్మిల చేప‌డుతున్న ఉద్యోగ దీక్ష లోట‌స్ పాండ్‌లో మూడవ రోజు కొన‌సాగుతోంది. ఈ దీక్షలో పాల్గొన్న ష‌ర్మిల చేతికి క‌ట్టుతో క‌నిపించారు.

గురువారం ఇందిరాపార్క్ వద్ద దీక్ష అనంతరం పాద‌యాత్రగా లోట‌స్ పాండ్‌కు వ‌స్తున్న ష‌ర్మిల‌ను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసే క్రమంలో తోపులాట జరిగి షర్మిల చేతికి గాయమైంది. దీంతో వైద్యులు ఆమె చేతికి కట్టు కట్టారు. ఇదిలా ఉండగా షర్మిల ఆరోగ్య స్థితిని డాక్టర్లు పరీక్షించాడు. పల్స్ డౌన్ కావడంతో ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యుడు సూచించగా షర్మిల నిరాకరించారు. గంటల పాటు దీక్ష కొనసాగిస్తానన్న షర్మిల ఆదివారం ఉదయం 11 గంటలకు విరమించే అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు షర్మిల అనుచరులు కొందరు కరోనా బారిన పడటం ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. ఇటీవల ఖమ్మం జిల్లాలో షర్మిల నిర్వహించిన సంకల్ప సభలో పాల్గొన్న పలువురు నేతలు వైరస్ బారిన పడ్డారు. షర్మిల ముఖ్య అనుచరుడు కొండ రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. సంగారెడ్డి ఇన్ చార్జి శ్రీధర్ రెడ్డితో పాటు ఒకరిద్దరు నాయకులు కరోనాతో ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇందిరాపార్క్ వద్ద దీక్షలో షర్మిల కూడా మాస్క్ లేకుండానే పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.





Untitled Document
Advertisements