అసెంబ్లీ ఎన్నికల్లో రూ.వెయ్యి కోట్లు సీజ్!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 01:51 PM

అసెంబ్లీ ఎన్నికల్లో రూ.వెయ్యి కోట్లు సీజ్!

ఎన్నికల్లో ప్రలోభాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఇటీవల ఎన్నికల పోలింగ్ ముగిసిన నాలుగు రాష్ట్రాల్లో పట్టుబడ్డ నగదు, మద్యం, ఆభరణాలే నిదర్శనం. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు నోట్లు వెదజల్లడం, మద్యం పోయడం వంటి ప్రలోభాలకు గురిచేశాయి. తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్‌, అసోం, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1000 కోట్లకు పైగా విలువచేసే నగదు, మద్యం, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది.

2016 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది రికార్డుస్థాయిలో పెరిగిందని వ్యాఖ్యానించింది. అప్పటి ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని సరిపోలుస్తూ ప్రత్యేక గ్రాఫ్‌లను విడుదల చేసింది. కిందటి ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం పట్టుబడ్డ నగదు, ఆభరణాలు, మద్యం విలువ ఐదు రెట్లు ఎక్కువ. ‘‘ఇప్పటి వరకూ ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడలేదు.. తొలిసారిగా రూ.1,000 కోట్ల స్వాధీనం చేసుకున్నాం’’అని ఎన్నికల కమిషన్‌ అండర్ సెక్రెటరీ పవన్ దివాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో రూ.448.28 కోట్లతో తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది.

ఆయా రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్‌ 15వరకు సీజ్‌ చేసిన నగదు, ఇతర సామగ్రి వివరాలను వెల్లడించారు. తమిళనాడులో అత్యధికంగా రూ.236.69 కోట్లు నగదు స్వాధీనం చేసుకోగా.. ఆ తర్వాత బెంగాల్‌లో రూ.50.71 కోట్లు, అసోంలో రూ.27.09కోట్లు, కేరళలో రూ.22.88కోట్లు, పుదుచ్చేరిలో రూ.5.52కోట్ల మేర నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.

ఇక, బెంగాల్‌లో రూ.118 కోట్ల విలువైన డ్రగ్స్, అసోంలో రూ.34కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అలాగే, అసోంలో రూ.41 కోట్ల విలువ చేసే మద్యం, బెంగాల్‌లో రూ.30 కోట్ల విలువైన మద్యం పట్టుబడిందని వివరించింది. తమిళనాడులో రూ.176 కోట్లు విలువచేసే ఆభరణాలు స్వాధీనం చేసుకోగా.. కేరళలో రూ.50 కోట్లు, పుదుచ్చేరిలో రూ.27కోట్ల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్‌లో రూ.88 కోట్ల విలువ చేసే మిగతా కానుకలు అధికారులు స్వాధీనం చేసుకోగా.. తమిళనాడులో రూ.25 కోట్లు, అసోంలో రూ.15కోట్ల విలువైన గిఫ్ట్‌లను పట్టుకున్నట్టు ఈసీ పేర్కొంది.

2016లో జరిగిన ఎన్నికల్లో రూ. 225.77 కోట్లు మాత్రమే సీజ్‌ చేసినట్టు తెలిపింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోంలలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే ముగియగా.. బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం బెంగాల్‌లో ఐదో దశ పోలింగ్‌ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో నగదు, మద్యంపై నిఘాకు ఐదు ప్రత్యేక ఎన్నికల పర్యవేక్షకులు, 321 మంది ఎన్నికల పరిశీలకులను ఈసీ మోహరించింది. మొత్తం 259 నియోజకవర్గాల్లో భారీగా ఖర్చుచేసినట్టు గుర్తించింది.





Untitled Document
Advertisements