మ్యాచ్‌లో అంపైర్లు తికమక!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 02:39 PM

మ్యాచ్‌లో అంపైర్లు తికమక!

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓ కామెడీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో పంజాబ్ పేసర్ రిలే మెరాడిత్ వరుసగా షార్ట్ పిచ్ బాల్స్‌ని సంధించాడు. ఈ క్రమంలో ఐదో బంతిని ఫుల్ చేసేందుకు చెన్నై ఓపెనర్ డుప్లెసిస్ (36 నాటౌట్: 33 బంతుల్లో 3x4, 1x6) ప్రయత్నించగా.. అతని బ్యాట్‌కి అత్యంత సమీపంలో నుంచి వెళ్లిన బంతి నేరుగా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతుల్లో పడింది. దాంతో.. ఔట్ కోసం పంజాబ్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ అనిల్ కుమార్ చౌదరి తన నిర్ణయాన్ని ప్రకటించకుండా స్వ్కేర్ లెగ్ అంపైర్ అనిల్ దండేకర్ వద్దకి వెళ్లాడు. అక్కడ అతనితో చర్చలు జరిపిన అనిల్ కుమార్ చౌదరి.. బంతి బ్యాట్‌కి తాకిందని చెప్తూనే.. బంతి ఫెయిర్ డెలివరీపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో తుది నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌కి అనిల్ కుమార్ చౌదరి రిఫర్ చేశాడు.

రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. షాట్ ఆడే క్రమంలో డుప్లెసిస్ కాస్త వంగిన నేపథ్యంలో.. బంతిని ఫెయిర్ డెలివరీగా ప్రకటించాడు. గ్రౌండ్‌లోని పెద్ద స్క్రీన్లపై ఆ రిప్లైని చూసిన అంపైర్ అనిల్ కుమార్ చౌదరి.. థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరీగా ప్రకటించగానే.. డుప్లెసిస్ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ.. ఆ వెంటనే థర్డ్ అంపైర్ మీరు ఇక ఔట్ ఇవ్వొచ్చని అనిల్ కుమార్ చౌదరికి సూచించాడు. దాంతో.. థర్డ్ అంపైర్ సూచన మేరకు.. అనిల్ కుమార్ చౌదరి తటపటాయిస్తూనే ఔటిచ్చేశాడు. తనకి రిఫర్ చేయకముందు అనిల్ కుమార్ చౌదరి.. డుప్లెసిస్ బ్యాట్‌కి బంతి తాకిందని చెప్పి ఉండటంతో.. థర్డ్ అంపైర్ అలా ఔట్ ఇవ్వమని సూచించాడు. దాంతో.. అనిల్ కుమార్ చౌదరి అది నాటౌట్‌గా తెలుస్తున్నా.. ఔటివ్వక తప్పలేదు.

అనిల్ కుమార్ చౌదరి ఔటివ్వగానే.. క్షణాల్లో డుప్లెసిస్ రివ్యూ కోరాడు. దాంతో.. మరోసారి రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్.. బ్యాట్‌కి బంతి తాకలేదని నిర్ధారించాడు. దాంతో.. అనిల్ కుమార్ చౌదరి మరోసారి డుప్లెసిస్‌ని నాటౌట్‌గా ప్రకటించాడు. ఈ అంపైర్ల తికమకకి పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మైదానంలో అసహనం వ్యక్తం చేస్తూ కనిపించగా.. బౌలర్ మెరాడిత్ ముసిముసిగా నవ్వుతూ కనిపించాడు. అప్పటికి చెన్నై విజయానికి 38 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఆఖరికి చెన్నై 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.








Untitled Document
Advertisements