కరోనా టెస్ట్ చేసుకోమంటే రైల్వేస్టేషన్ నుంచి పరుగులు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 02:50 PM

కరోనా టెస్ట్ చేసుకోమంటే రైల్వేస్టేషన్ నుంచి పరుగులు

పదుల సంఖ్యలో జనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడేదో ప్రమాదం జరిగిందనుకుంటే పొరపాటే. కరోనా టెస్ట్‌ల నుంచి తప్పించుకోడానికే అలా పరుగులు తీస్తున్నారు. బిహార్‌లోని బక్సార్ రైల్వే స్టేషన్‌లో గురువారం నాటి ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రైలు దిగి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఓ వ్యక్తిని కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్య కార్యకర్త అడుగుతుంటే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చడంతో వివిధ ప్రాంతాల నుంచి బిహార్‌కు వచ్చే స్థానికులకు రైల్వే స్టేషన్‌లలో కరోనా పరీక్షల కోసం ఏర్పాట్లుచేయాలని సీఎం నితీశ్ కుమార్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు రైల్వే స్టేషన్‌లో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. ‘‘స్క్రీనింగ్ పరీక్షల కోసం ప్రయాణికులను మేము ఆపుతుంటే వాగ్వాదానికి దిగుతున్నారు.. ఈ సమయంలో పోలీసులు ఎవరూ స్టేషన్‌లో లేరు.. అయితే, తర్వాత ఓ మహిళా పోలీస్ వచ్చినా తాను ఏం చేయాలేనని చేతులెత్తేసింది’’ అని స్థానిక ఆరోగ్య కార్యకర్త జయ్ తివారీ తెలిపారు. లాక్‌డౌన్ భయంతో ముంబయి, పుణే, ఢిల్లీల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు బిహార్‌కు చేరుకుంటున్నారు. ముంబయి, పుణే, ఢిల్లీ వంటి నగరాలలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా పలు పెద్ద నగరాలు, పట్టణాల నుంచి వలస కూలీలు స్వస్థలాలకు చేరుకోడానికి నానా అగచాట్లు పడ్డారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే సొంతూళ్లకు చేరుకుంటున్నారు. బిహార్‌లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సీఎం నితీశ్ కుమార్ శుక్రవారం అత్యున్నత సమావేశం ఏర్పాటుచేశారు. కరోనా కారణంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులను ఈ ఏడాది కూడా పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు బిహార్ ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా పాఠశాలల నిర్వహణకు ఆటంకాలు ఎదురవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం నితీశ్ శనివారం అఖిలపక్షం సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.








Untitled Document
Advertisements