DRS: దీపక్ చాహర్ రిక్వెస్ట్...నో చెప్పిన ధోనీ!

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 03:41 PM

DRS: దీపక్ చాహర్ రిక్వెస్ట్...నో చెప్పిన ధోనీ!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ షాట్ కోసం క్రీజు వెలుపలికి వెళ్లినప్పుడు ఏమాత్రం బాల్ మిస్ అయినా.. అతనికి బెయిల్స్‌లో ధోనీ స్వాగతం పలుకుతుంటాడు. 37 ఏళ్ల వయసులోనూ క్యాచ్‌లను డైవ్ చేస్తూ అందుకునే ధోనీకి డీఆర్‌ఎస్ కోరడంలో మంచి సక్సెస్ రేట్ ఉంది. వికెట్ల వెనుక నుంచి బంతి గమనాన్ని నిశితంగా పరిశీలించే ధోనీ.. బౌలర్లు ఎంత రిక్వెస్ట్ చేసినా.. ఒక్కోసారి డీఆర్‌ఎస్ కోరేందుకు ఇష్టపడడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లోనూ దీపక్ చాహర్‌‌ కోరిన డీఆర్‌ఎస్ రిక్వెస్ట్‌ని ధోనీ తిరస్కరించాడు. దానికి గల కారణాన్ని కూడా ధోనీ వెల్లడించాడు.

మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన దీపక్ చాహర్.. ఇన్ స్వింగర్‌ని సంధించగా.. పంజాబ్ యువ హిట్టర్ షారూక్ ఖాన్ ఆ బంతిని రీడ్ చేయలేకపోయాడు. దాంతో.. బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌కి తాకింది. వెంటనే ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం చెన్నై టీమ్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అయితే.. బంతి నేరుగా వికెట్లకి తాకేటట్లు కనిపించిందని ధోనీకి చెప్పిన దీపక్ చాహర్.. డీఆర్‌ఎస్ కోరాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు. కానీ.. ధోనీ మాత్రం బంతి వికెట్లపై నుంచి వెళ్లిపోతున్నట్లు దీపక్ చాహర్‌కి చెప్పి.. డీఆర్‌ఎస్ కోరబోనని స్పష్టం చేశాడు. మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన దీపక్ చాహర్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది.

దీపక్ చాహర్ డీఆర్‌ఎస్ రిక్వెస్ట్‌ని తిరస్కరించడంపై ధోనీ స్పందించాడు. ‘‘బంతి వికెట్ల పైనుంచి వెళ్లేలా కనిపించింది. దాంతో.. దీపక్ చాహర్‌తో మనం రివ్యూ కోరకూడదు అని చెప్పాను. నేను ఎప్పుడూ డీఆర్‌ఎస్‌ని ఒక సింపుల్ ఛాన్స్‌గా భావించను. ఒకవేళ మనం డీఆర్‌ఎస్ ఛాన్స్ తీసుకోవాలని భావిస్తే..? అది చివరి ఓవర్ అయినా అయ్యుండాలి లేదా చాలా కీలకమైన వికెట్ అయినా అయ్యుండాలి’’ అని ధోనీ వెల్లడించాడు. రిప్లైలో ధోనీ అంచనానే నిజమైంది. బంతి వికెట్లపై నుంచి వెళ్లేలా కనిపించింది. ఈ మ్యాచ్‌‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.





Untitled Document
Advertisements