ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో టాప్-2లో చెన్నై

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 05:49 PM

ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో టాప్-2లో చెన్నై

ఐపీఎల్ 2021 సీజన్‌లో బోణి కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలోనూ చిట్ట చివరి స్థానం నుంచి టాప్-2లోకి దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో వాంఖడే వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్‌ని 106/8కే పరిమితం చేసిన చెన్నై.. లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించేసింది. దాంతో.. చెన్నై నెట్ రన్‌రేట్ కూడా ఊహించని విధంగా మెరుగైంది.

పంజాబ్‌తో మ్యాచ్ ముందు వరకూ -0.779 నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లని ఖాతాలో వేసుకోవడంతో పాటు.. +0.616 నెట్‌ రన్‌రేట్‌తో రెండో స్థానానికి ఎగబాకింది. మరోవైపు పేలవ ఓటమితో పంజాబ్ కింగ్స్ మూడో స్థానం నుంచి ఏడుకి పడిపోయింది. దాంతో.. టోర్నీలో ఇప్పటి వరకూ గెలుపు బోణి అందుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్ చిట్ట చివరి స్థానానికి దిగజారింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7.30 గంటలకి ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీకొనబోతోంది.

పాయింట్ల పట్టికలో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టాప్-4లో కొనసాగుతుండగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా.. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి.





Untitled Document
Advertisements