ఒడిషా గ్యాంగ్‌స్టర్ ఎస్కేప్...సెక్యూరిటీకి బిర్యానీలో మత్తుమందు

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 06:00 PM

ఒడిషా గ్యాంగ్‌స్టర్ ఎస్కేప్...సెక్యూరిటీకి బిర్యానీలో మత్తుమందు

ఘరానా గ్యాంగ్ స్టర్ షేక్ హైదర్ విచారణలో ఆసక్తికరమైన కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతను ఒడిశాలోని కటక్ ఆస్పత్రి నుంచి తప్పించుకుని, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు జహీరాబాద్ రూరల్ పరిధిలోని హత్నూర్‌లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి తాను తప్పించుకోవడానికి తన ప్రధాన అనుచరుడు యాకూబ్ సాయం చేసినట్లు విచారణలో గ్యాంగ్‌స్టర్ అంగీకరించాడు. భువనేశ్వర్, కటక్, పూరీ జిల్లాలో నమోదైన అనేక హత్య, హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీ కేసులో హైదర్ నిందితుడిగా ఉన్నాడు. ఇతను సొంతంగా ఓ ముఠా ఏర్పాటు చేసుకొని గ్యాంగ్ స్టర్ అవతారమెత్తాడు.

పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినా తేలిగ్గా బెయిల్‌ పొంది బయటకు వచ్చాడు. ఇతనికి బద్ద శత్రువుగా ఉండే ప్రత్యర్థి గ్యాంగ్ స్టర్ షేక్ సులేమాన్ సోదరుడు షేక్ చాను హత్య కేసులోనూ ఇతడికి జీవితఖైదు పడింది. ఆ శిక్ష అనుభవిస్తుండగానే భువనేశ్వర్‌కు చెందిన మైన్స్ యజమాని రష్మీరాజన్ మొఘాప్తారా కిడ్నాప్, హత్య కేసులో కూడా జీవితఖైదు పడింది. ఈ కేసుల్లో ఏకకాల శిక్ష అనుభవిస్తూ హైదర్ నాలుగేళ్ల క్రితం వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైల్లో ఉన్నాడు. అక్కడి నుంచే దందాలు చేస్తున్నాడని, తప్పించుకోవడానికి పథక రచన చేస్తున్నాడని ఒడిశా నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో 2018లో ఇతడిని అధికారులు సబల్ పూర్ జైలుకు మార్చారు.

అక్కడ తనకు కిడ్నీ సమస్య వచ్చినట్లు జైలు అధికారులకు చెప్పిన హైదర్ చికిత్స కోసమని మార్చి 23న కటక్‌లోని ఎస్ సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరాడు. అక్కడికి తరచుగా తన అనుచరులు, కుటుంబీకుల్ని పిలిపించుకునేవాడు. వీళ్ల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సెంట్రీ విధుల్లో ఉండే అధికారులు పట్టించుకోలేదు. కేవలం ఒకే కానిస్టేబుల్‌ను సెంట్రీగా ఉంచారు. దీన్ని ఆసరాగా తీసుకున్న హైదర్ తన రైట్ హ్యాండ్ యాకూబ్‌తో కలిసి ఎస్కేప్‌కు స్కెచ్ వేశాడు. ఈ నెల 5న మత్తుమందు కలిపిన బిర్యానీని సెంట్రీకి అందించాడు. అతడు మత్తులోకి జారుకోగా.. హైదర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. యాకూబ్ ఏర్పాటు చేసిన వాహనంలో ఒడిశా నుంచి ఈ గ్యాంగ్ స్టర్ విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించి హైదారాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా తన కారును గుర్తిస్తారని, దాన్ని పెద్ద అంబర్ పేట వద్ద వదిలేసినట్టు హైదర్ విచారణలో మొత్తం బయటపెట్టాడు.






Untitled Document
Advertisements