కోవిడ్ టీకా తీసుకున్నాకే వివేక్ మరణం!?...ఆరోగ్య కార్యదర్శి క్లారిటీ

     Written by : smtv Desk | Sat, Apr 17, 2021, 07:03 PM

కోవిడ్ టీకా తీసుకున్నాకే వివేక్ మరణం!?...ఆరోగ్య కార్యదర్శి క్లారిటీ

అపరిచితుడు, బాయ్స్, శివాజీ, సింగం, రఘువరన్ బీటెక్ తదితర చిత్రాలలో అద్భుమైన హాస్యాన్ని పండించి తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హాస్య నటుడు వివేక్(59) శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. కార్డియాక్ అరెస్టుతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ.. శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్ర్భాంతి నెలకొంది.

అయితే వివేక్ మరణంపై సర్వత్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న ఆయన.. గురువారం రెండో డోసు టీకా తీసుకున్నారు. టీకా తీసుకున్న మరుసటి రోజే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కరోనా టీకా తీసుకోవడం వల్లే వివేక్ ప్రాణాలు కోల్పోయారని కొందరు అంటున్నారు. గుండె జబ్బు ఉన్న వివేక్‌కు అసలు టీకా ఎందుకు ఇచ్చారని.. సహచర నటులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాపై మరోసారి ప్రజల్లో భయాందోళన నెలకొంది.

ఈ భయాన్ని తొలగించడానికి తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ వివేక్ మరణంపై వివరణ ఇచ్చారు. ఆయన మరణానికి కోవిడ్ టీకాతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఇది మాకు షాకింగ్ వార్త. అయితే వివేక్‌కు కరోనా లేదు. ఆయన ఇంతకు ముందు చేసుకున్న పరీక్షల్లో కూడా రిపోర్ట్ నెగిటివ్ అనే వచ్చింది. ఆయనకు గుండె జబ్బు అంతకు ముందు నుంచే ఉంది. గుండెనాళ్లలో బ్లాక్స్ ఉన్నాయి. గురువారం వివేక్‌తో పాటు 860 మంది కోవిడ్ టీకా తీసుకున్నారు. కానీ, అందరూ మంచిగానే ఉన్నారు. టీకా తర్వాత అనాఫిలాక్టిక్ ప్రతి చర్య 15 నుంచి 30 నిమిషాల్లో ప్రారంభం అవుతుంది. దీని కోసం మేము వైద్య సదుపాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements