ఐపీఎల్ 2021 సీజన్‌లో RCB హ్యాట్రిక్

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 10:59 AM

ఐపీఎల్ 2021 సీజన్‌లో RCB హ్యాట్రిక్

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన బెంగళూరు 38 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు టీమ్ గెలుపొందగా.. మూడో మ్యాచ్‌ ఆడిన కోల్‌కతాకి ఇది రెండో ఓటమి.

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్.. ఏబీ డివిలియర్స్ (76 నాటౌట్: 34 బంతుల్లో 9x4, 3x6), గ్లెన్ మాక్స్‌వెల్ (78: 49 బంతుల్లో 9x4, 3x6) చెలరేగడంతో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఈ జంట దెబ్బకి కోల్‌కతా బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టగా.. పాట్ కమిన్స్, ప్రసీద్ చెరో వికెట్ తీశారు. ఆండ్రీ రసెల్ వేసిన రెండు ఓవర్లలోనే ఏకంగా 38 పరుగులు సమర్పించుకున్నాడు.

205 పరుగుల లక్ష్యఛేదనలో కోల్‌కతా ఆరంభం నుంచే దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్ (21: 9 బంతుల్లో 2x4, 2x6), నితీశ్ రాణా (18: 11 బంతుల్లో 2x4, 1x6) మొదట్లోనే భారీ షాట్లు ఆడారు. కానీ.. వ్యూహాత్మకంగా పేస్‌ని మారుస్తూ.. స్లో డెలివరీలు విసిరిన బెంగళూరు బౌలర్లు.. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ వచ్చారు. దాంతో.. పరుగులు వస్తున్నా.. కోల్‌కతా వికెట్లు చేజార్చుకుంటూ వచ్చింది.

మిడిల్ ఓవర్లలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (29: 25 బంతుల్లో 1x4, 1x6), షకీబ్ అల్ హసన్ (26: 25 బంతుల్లో 1x4, 1x6) బంతుల్ని వేస్ట్ చేసేయగా.. చివర్లో ఆండ్రీ రసెల్ (31: 20 బంతుల్లో 3x4, 2x6)కి సపోర్ట్ ఇచ్చే బ్యాట్స్‌మెన్ కరవయ్యాడు. దాంతో.. తన వద్దే స్ట్రైక్ ఉంచుకుంటూ వచ్చిన ఆండ్రీ రసెల్.. చివర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో హిట్టింగ్ చేస్తూ.. టీమ్ స్కోరు 162 వద్ద ఔటయ్యాడు. అయితే.. అప్పటికే మ్యాచ్‌ కోల్‌కతా చేతుల్లో నుంచి జారిపోయింది. ఛేదనలో కోల్‌కతా 166/8కే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లలో జెమీషన్ మూడు వికెట్లు పడగొట్టగా.. చాహల్, హర్షల్ పటేల్ చెరో రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. దేవదత్ పడిక్కల్ (25: 28 బంతుల్లో 2x4)తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన కోహ్లీ.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి రజత్ పాటిదార్ (1: 2 బంతుల్లో) కూడా ఔటవడంతో.. బెంగళూరు ఆరంభంలోనే 9/2తో ఒత్తిడిలో పడింది.

కానీ.. నెం.4లో బ్యాటింగ్‌‌కి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్.. ఆరంభం నుంచే టాప్ గేర్‌లో కొనసాగాడు. స్పిన్నర్లతో పాటు పేసర్ల బౌలింగ్‌లోనూ భారీ షాట్లు ఆడేసిన మాక్స్‌వెల్.. తన మార్క్ స్విచ్ హిట్‌ షాట్‌తో సిక్సర్లు బాదేశాడు. ఈ క్రమంలో దేవదత్ పడిక్కల్‌తో కలిసి మూడో వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మాక్స్‌వెల్.. నాలుగో వికెట్‌కి ఏబీ డివిలియర్స్‌తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. టీమ్ స్కోరు 148 వద్ద మాక్స్‌వెల్ ఔటవగా.. చివర్లో ఏబీ డివిలియర్స్ బాధ్యత తీసుకుని వరుసగా ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరుకి ఊహించని స్కోరుని అందించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన ఆండ్రీ రసెల్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదిన ఏబీ డివిలియర్స్ 21 పరుగుల్ని రాబట్టాడు. ఆఖర్లో అతనికి జోడీగా జెమీషన్ (11 నాటౌట్: 4 బంతుల్లో 1x4, 1x6) కూడా బ్యాట్ ఝళిపించాడు.






Untitled Document
Advertisements