ఐపీఎల్ 2021: రాజస్థాన్‌తో ఈరోజు చెన్నై ఫైట్

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 11:36 AM

ఐపీఎల్ 2021: రాజస్థాన్‌తో ఈరోజు చెన్నై ఫైట్

ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోరుకి ముంబయిలోని వాంఖడే స్టేడియం సోమవారం ఆతిథ్యం ఇవ్వబోతోంది. రాత్రి 7.30 గంటలకి ప్రారంభంకానున్న ఈ మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుని సంజు శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ ఢీకొట్టబోతోంది. ఫస్ట్ మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఘన విజయంతో టోర్నీలో బోణి కొట్టింది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిన రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి ఓవర్‌లో గెలిచింది.

హెడ్ టు హెడ్ రికార్డుల పరంగా చూసుకుంటే.. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఇప్పటి వరకూ 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. మిగిలిన 9 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ రెండు జట్లు తలపడిన సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదవుతున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. రాజస్థాన్‌పై ఇప్పటి వరకూ చెన్నై చేసిన అత్యధిక స్కోరు 246 పరుగులుకాగా.. చెన్నైపై రాజస్థాన్ చేసిన అత్యధిక స్కోరు 223 పరుగులు. గత రెండు సీజన్ల రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. 2019లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా.. రెండింటిలోనూ చెన్నై గెలుపొందింది. ఆ తర్వాత 2020 సీజన్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ విజయం సాధించడం గమనార్హం.

చెన్నై జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తుండగా.. మరో ఓపెనర్ డుప్లెసిస్ దూకుడుగా ఆడలేకపోతున్నాడు. అయితే.. నెం.3లో ఆడుతున్న మొయిన్ అలీ, ఆ తర్వాత వస్తున్న సురేశ్ రైనా టీమ్ స్కోరు బోర్డుని నడిపిస్తున్నారు. కానీ.. అంబటి రాయుడు రెండు మ్యాచ్‌ల్లోనూ అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఆల్‌రౌండర్ శామ్ కరన్ బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు.


బౌలింగ్ పరంగా దీపక్ చాహర్ కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో మంచి జోష్‌లో ఉండగా.. మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో కూడా లయ అందుకుని పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. ఇక శామ్ కరన్.. డెత్ ఓవర్లలో ఆకట్టుకుంటున్నాడు. అయితే.. శార్ధూల్ ఠాకూర్ ఒక్కడే ధారాళంగా పరుగులిచ్చేస్తూ.. ఆ జట్టుని కంగారు పెడుతున్నాడు.

రాజస్థాన్ జట్టు‌లో ఓపెనర్లు జోస్ బట్లర్, మనన్ వోహ్రా నిలకడలేమితో ఇబ్బంది పడుతుండగా.. కెప్టెన్ సంజు శాంసన్ సెంచరీ తర్వాత మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. ఇక మిడిలార్డర్‌లో శివమ్ దూబె, రియాన్ పరాగ్ వరుస మ్యాచ్‌ల్లో ఫెయిలవగా.. డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరీస్ గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడటం రాజస్థాన్‌కి గొప్ప ఊరట. మరీ ముఖ్యంగా.. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో గెలుపుపై ఆశలు వదిలేసిన స్థితిలో క్రిస్ మోరీస్ నాలుగు సిక్సర్లు బాది రాజస్థాన్‌ని గెలిపించాడు. దాంతో.. చెన్నైపై మ్యాచ్‌లో అతడ్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త ముందుకు పంపే అవకాశం ఉంది.

బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే 3 వికెట్లు పడగొట్టి లయ అందుకోగా.. ముస్తాఫిజుర్ మునుపటి ఫామ్‌ని అందుకున్నాడు. ఇక క్రిస్ మోరీస్ కూడా డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. యువ పేసర్ సకారియా అంచనాలకి మించి రాణిస్తుండటంతో రాజస్థాన్‌లో.. జోప్రా ఆర్చర్ లేని లోటు కనిపించడం లేదు. స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ చేతి వేలి గాయం కారణంగా ఫస్ట్ మ్యాచ్ తర్వాత రాజస్థాన్ టీమ్‌కి దూరమవడవంతో.. టీమ్‌లో సమతూకం లోపించినట్లు కనిపిస్తోంది.





Untitled Document
Advertisements