ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి రీఎంట్రీపై ఏబీ డి క్లారిటీ

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 12:44 PM

ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి రీఎంట్రీపై ఏబీ డి క్లారిటీ

దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన స్వదేశానికి వెళ్లిన ఏబీ డివిలియర్స్.. అనూహ్యంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. అయితే.. రోజుల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్న ఏబీడీ.. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించాడు. కానీ.. టీమ్‌ భవిష్యత్‌ని పట్టించుకోకుండా స్వార్థంగా అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని అప్పట్లో విమర్శించిన కొందరు.. అతని పునరాగమనాన్ని వ్యతిరేకించారు. దాంతో.. ఏబీడీ కూడా మౌనంగా ఉండిపోయాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ పరాజయాలతో కనీసం సెమీస్‌కి కూడా చేరలేకపోయింది. టీమ్‌లోనూ సమతూకం పూర్తిగా దెబ్బతినడంతో.. అప్పటి దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మళ్లీ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీపై పావులు కదిపాడు. కానీ.. కొన్ని రోజులకే డుప్లెసిస్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో.. ఏబీడీ రీఎంట్రీ మళ్లీ వాయిదాపడింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా టీమ్‌కి హెడ్ కోచ్‌గా వచ్చిన మార్క్ బౌచర్.. ఏబీ డివిలియర్స్ రీఎంట్రీ కోసం పట్టుబడుతున్నాడు. గత ఏడాది కూడా ఈ విషయమై ఏబీతో అతను సంప్రదించాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కి ఆడుతున్న 37 ఏళ్ల ఏబీ డివిలియర్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అసాధారణ హిట్టింగ్‌తో అదరగొట్టేశాడు. కేవలం 34 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన ఏబీడీ 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అతని రీఎంట్రీపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో.. డివిలియర్స్ స్పందించాడు. ‘‘మార్క్ బౌచర్ గత ఏడాది నీకు ఇంట్రస్ట్ ఉందా..? అని అడిగాడు. నేను నిస్సందేహంగా ఉంది అని చెప్పాను. అయితే.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే విషయంపై ఇంకా మా మధ్య చర్చ జరగలేదు. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత ఫామ్, ఫిట్‌నెస్‌ని బేరీజు వేసుకుని బౌచర్‌తో మాట్లాడతా’’ అని డివిలియర్స్ వెల్లడించాడు.





Untitled Document
Advertisements