ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతకు చెక్!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 04:02 PM

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరతకు చెక్!

కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ అంశంపై పలు రాష్ట్రాలు చేసిన విజ్ఞ‌ప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ కొరత నివారించేందుకు ఏప్రిల్ 22 నుంచి పారిశ్రామిక అవసరాలకు సరఫరాను బంద్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదివారం లేఖ రాశారు. తొమ్మిది పరిశ్రమలకు మినహా మిగతా వాటికి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు.

సాధికార బృందం-2 చేసిన సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజయ్‌ భల్లా తెలిపారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కింది స్థాయి అధికారులకు ఈ సమాచారాన్ని చేరవేసి పక్కగా అమలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ఈ చర్యల వల్ల దేశంలో మెడికల్‌ ఆక్సిజన్‌ సౌకర్యం పెరిగి విలువైన ప్రాణాలు నిలబెట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని అజయ్ భల్లా పేర్కొన్నారు. మరోవైపు, ఇదే అంశంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ కూడా రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాశారు.

దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచడంతోపాటు, అందుబాటులో ఉన్నదాన్ని హేతుబద్ధంగా గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రయత్నించాల్సి ఉందని వివరించారు. భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చించి పారిశ్రామిక ఆక్సిజన్‌ వినియోగాన్ని నియంత్రించి దాన్ని వైద్య అవసరాల కోసం మళ్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మెడికల్ ఆక్సిజన్ వినియోగం ఇప్పటికే దాదాపు 60 శాతం పెరిగిందని, రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని అన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో భారీగా వినియోగం పెరిగింది.

ఈ నిషేధం తొమ్మిది పరిశ్రమలకు వర్తించదని స్పష్టం చేశారు. యాంపౌలెస్‌ అండ్‌ వయల్స్‌ (టీకా మందులు), ఔషధ, పెట్రోలియం శుద్ధి, ఉక్కు, అణు ఇంధన సౌకర్యాలు, ఆక్సిజన్‌ సిలిండర్‌ తయారీ, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, ఆహారం, నీటి శుద్ధి కేంద్రాలు, ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు మినహాయింపు ఉన్నట్లు వివరించారు. మిగిలిన పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరా చేయొద్దని సూచించారు. దిగుమతి చేసుకోవడం, సొంత ఉత్పత్తి కేంద్రాల్లో తయారు చేసుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని తెలిపారు.

తూర్పు ప్రాంతంలోని ఉక్కు కంపెనీలు, శుద్ధి కర్మాగారాలు బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అవసరాలను తీర్చాయి. అదేవిధంగా, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని యూనిట్లు ఆ ప్రాంతాలలోని రాష్ట్రాలకు సేవలు అందిస్తున్నాయి. కర్మాగారాల నుంచి ద్రవ ఆక్సిజన్‌ను క్రయోజెనిక్ ట్యాంకర్లలో తరలించాల్సిన అవసరం ఉందని, ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని ఓ స్టీల్ ప్లాంట్ సీఈఓ చెప్పారు. పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే పెద్ద ఆసుపత్రులలో ద్రవ ఆక్సిజన్‌ను “బుల్లెట్లు” లేదా ట్యాంకులలో నిల్వ చేయవచ్చు. కానీ, చిన్న వాటికి సిలిండర్లు ఉండాలని, బాట్లింగ్ సౌకర్యాలు అవసరమని తెలిపారు.





Untitled Document
Advertisements