ఆధార్ నమోదులో హైదరాబాద్‌కు అగ్రస్థానం....దేశంలోనే టాప్!!

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 04:06 PM

ఆధార్ నమోదులో హైదరాబాద్‌కు అగ్రస్థానం....దేశంలోనే టాప్!!

ఆధార్ నమోదులో భాగ్యనగరం రికార్డు నెలకొల్పింది. నగర జనాభా కంటే ఎక్కువగా ఆధార్ కార్డులు జారీచేసి దేశంలోనే నంబర్‌వన్‌గా హైదరాబాద్‌ నిలిచింది. ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికులు, ఉద్యోగులతో పాటు హైదరాబాద్‌లో చదువుకోవడానికి వచ్చిన వేలాది మంది ఇక్కడే ఆధార్ నమోదు చేసుకోవడం విశేషం.

2021 ఏప్రిల్‌ 10వ తేదీ నాటికి గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆధార్‌ కార్డులు తీసుకున్నవారి సంఖ్య 1.21 కోట్లకు చేరినట్లు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవగా... ఢిల్లీ, ముంబై నగరాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఆయా నగరాల్లో కూడా వలసలు ఎక్కువగా ఉండటంతో జనాభా సంఖ్యను మించి ఆధార్‌ కార్డులు జారీ అయ్యాయని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో ఏటా పెరుగుదల కనిపించే జనాభా రేటు ఇటీవల కాస్త తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 1991 నుంచి 2001 మధ్య జనాభా పెరుగుదల రేటు 28.91% ఉండగా.. 2011 నాటికి 26 శాతానికి, 2017 నాటికి 17 శాతానికి తగ్గింది. 2011 లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా 74.04 లక్షలు కాగా... 2017 అంచనాల ప్రకారం 93.06 లక్షలకు, ప్రస్తుతం 1.10కోట్ల వరకు పెరిగినట్టు అంచనా.

Untitled Document
Advertisements