పాకిస్థాన్ ఫీల్డర్లని తలపించిన RCB

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 04:56 PM

పాకిస్థాన్ ఫీల్డర్లని తలపించిన RCB

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలు సాధిస్తున్నా.. ఫీల్డింగ్‌లో ఆ జట్టు ఇంకాస్త మెరుగవ్వాల్సి ఉంది. టోర్నీ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్యాచ్ వదిలేయగా.. బంతి బౌన్స్ అయ్యి అతని కంటి కింద భాగాన్ని తాకింది. అయితే.. అతనికి ఎలాంటి గాయం కాకపోడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సులువుగా అందుకోవాల్సిన క్యాచ్‌ని కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా మహ్మద్ సిరాజ్, చాహల్ నేలపాలు చేశారు.

ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ.. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి.. థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి ఎత్తుగా లేచింది. దాంతో.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ ఆ బంతిని క్యాచ్‌గా అందుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి మరో ఫీల్డర్ మహ్మద్ సిరాజ్ కూడా వచ్చాడు. అయితే.. ఇద్దరిలో ఎవరు ఆ క్యాచ్ పట్టాలో..? తేల్చుకోలేక ఇద్దరూ వెనక్కి తగ్గారు. దాంతో.. ఇద్దరి మధ్యలోపడి క్యాచ్ నేలపాలైంది.వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో క్రిస్‌గేల్ క్యాచ్‌ని షోయబ్ అక్తర్, సయ్యద్ అజ్మల్ ఇలానే చేజార్చారు. ఎక్కువ ఎత్తులో గాల్లోకి లేచిన బంతిని సయ్యద్ అజ్మల్ అందుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. అక్కడికి షోయబ్ మాలిక్ వచ్చాడు. దాంతో.. ఇద్దరిలో ఎవరు ఆ క్యాచ్‌ని పట్టాలో తేల్చుకోలేకపోగా.. క్యాచ్ నేలపాలైంది. ఐపీఎల్‌లోనూ సంజు శాంసన్, అమిత్ మిశ్రా ఇదే తరహాలో ఓ క్యాచ్‌ని చేజార్చారు.
Untitled Document
Advertisements