బీజేపీ నేతల నిర్ణయాలు వద్దు...ఎన్నికల సంఘానికి మమతా వేడుకోలు

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:17 PM

బీజేపీ నేతల నిర్ణయాలు వద్దు...ఎన్నికల సంఘానికి మమతా వేడుకోలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో నేతల దృష్టి పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై పడింది. రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ప్రచార ర్యాలీలను రద్దు చేసుకుంటున్నానని సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేతలందరూ ఒకసారి కరోనా పరిస్థితులను గురించి ఆలోచించాలని సూచించారు. రాహుల్ బాటలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నడిచారు.

కరోనా నేపథ్యంలో తక్కువ మందితో ర్యాలీలు, చిన్నచిన్న సభలకే పరిమితమవుతున్నట్లు టీఎంసీ నేతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో మిగిలిన మూడు దశల ఎన్నికల షెడ్యూల్‌ని కుదించాలని సీఎం మమత మరోమారు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఐదో విడత ఎన్నికలకు ముందే కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో నాలుగు విడతల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సీఎం మమతా బెనర్జీ ఈసీని కోరారు.

అయితే ఈసీ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఐదో విడత ఎన్నికలు పాత షెడ్యూల్ ప్రకారమే జరిగాయి. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని.. కోవిడ్‌ను నియంత్రించేందుకు మిగిలిన మూడు విడతల పోలింగ్‌ను ఒక రోజుకి కుదించాలని ఆమె కోరారు. లేకుంటే రెండు రోజులకు పరిమితం చేయాలని.. ఒకరోజైనా తగ్గించాలని మమత చేతులు జోడించి వేడుకున్నారు.

ఉత్తర దినాజ్‌పూర్ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ‘‘ చేతులు జోడించి అడుగుతున్నా. దయచేసి మిగిలిన మూడు విడతల ఎన్నికలను ఒకేరోజు నిర్వహించండి. లేకుంటే రెండు రోజులు నిర్వహించి ఒక్కరోజైనా ఆదా చేయండి. బీజేపీ చెప్పినట్ల విని నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కరోజైనా ఎన్నికల షెడ్యూల్‌ని కుదించి ప్రజారోగ్యాన్ని కాపాడండి.’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె విజ్ఞప్తిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.





Untitled Document
Advertisements