కొడుకు కోసం ఇంట్లోనే జీపు తయారు చేసిన తండ్రి

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:19 PM

కొడుకు కోసం ఇంట్లోనే జీపు తయారు చేసిన తండ్రి

పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వారు ఏం అడిగినా కొనిస్తారు. అయితే, కొందరు మాత్రం తమ చేతులతోనే స్వయంగా తయారు చేయాలని భావిస్తారు. కేరళకు చెందిన ఓ తండ్రి అదే చేశాడు. తన కొడుకు అడిగాడని ఏకంగా మహింద్రా జీపు తరహా వాహనాన్ని తయారు చేసేశాడు. ఇంటి వద్దే.. స్వయంగా.. తన చేతులతో తయారు చేసిన ఈ జీపును చూస్తే తప్పకుండా ఒరిజినల్ అని అనుకుంటారు.

కేరళలోని మలప్పురం జిల్లా అరికొడేలో నివసిస్తున్న షకీర్ 1000 వాట్ల బ్యాటరీతో పనిచేసే జీపును తయారు చేశాడు. ఈ జీపు సైజులో చిన్నదైనా.. ఒరిజినల్ మహీంద్ర వాహనానికి ఏ మాత్రం తీసిపోదు. పవర్ స్టీరింగ్, మాన్యువల్ గేర్ బాక్స్, హెడ్‌లైట్స్, డ్రైవర్-ప్యాసింజర్ సీట్లతోపాటు వెనుకవైపు కూర్చోడానికి రెండు బెంచులు కూడా ఏర్పాటు చేశాడు. ఈ జీపుకు పవర్ విండోస్, ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉన్నాయి.

ఈ సందర్భంగా షకీర్ మాట్లాడుతూ.. ‘‘ఈ వాహనాన్ని ఒట్టి చేతులతోనే తయారు చేశాను. వెల్డిండ్ నుంచి కలరింగ్ వరకు ప్రతి ఒక్కటీ నేనే చేశాను. జీపు బాడీ తయారు చేయడం కోసం సుత్తితో లోహాన్ని బాదాల్సి వచ్చేది. ఆ శబ్దాలకు ఇరుగుపొరుగువారు ఇబ్బందిపడేవారు. దీంతో ఓ గ్యారేజ్ అద్దెకు తీసుకుని వాహన తయారీని పూర్తి చేశాను. దీని తయారీకి ఏడాదిపాటు శ్రమించాను’’ అని షకీర్ తెలిపాడు. అయితే, ఈ జీపును షకీర్ ఐదేళ్ల కిందటే తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జీపు పూర్తి తన కొడుకు, అతడి స్నేహితుల కోసమే తయారు చేశానని షకీర్ తెలిపాడు. ఇందులో పెద్దవాళ్లు కూర్చోవడం చాలా కష్టం. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా షకీర్‌కు శ్రమకు సలాం చేస్తారు.

Untitled Document
Advertisements