‘గల్లీ రౌడీ’ టీజర్‌ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:51 PM

‘గల్లీ రౌడీ’ టీజర్‌ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ

సినిమా.. సినిమాకి తనలో వేరియేషన్ చూపిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు యువ నటుడు సందీప్ కిషన్. కెరీర్‌లో గొప్ప హిట్ సాధించిన సినిమాలు లేకపోయినా.. ప్రయోగాలు చేయడంలో మాత్రం అతను వెనకడుగు వేయడు. తాజాగా తెలుగు తెరపై తెరకెక్కిన తొలి హాకీ చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌తో సందీప్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త నిరాశ పరిచింది. అయితే ఈ సినిమా తర్వాత సందీప్ ‘గల్లీ రౌడీ’ అనే సినిమాతో ప్రేక్షకులను త్వరలో పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోమవారం లాంచ్ చేశాడు. కుటంబం బలవంతం వల్ల రౌడీగా మారిన వ్యక్తిగా సందీప్ ఇందులో కనిపిస్తున్నాడు. ‘బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’ అంటూ పోసాని కృష్ణ మురళీ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌తో కలిసి హీరో ఓ వ్యక్తిని చేసే కిడ్నాప్ నేపథ్యంలో కథ సాగుతుంది. అయితే వాళ్లు ఎవరిని కిడ్నాప్ చేస్తారా.. అనే విషయాన్ని సస్పెన్స్‌లో ఉంచారు. చివరిగా ‘ఎవరైనా మనవడిని డాక్టర్ చేస్తాడు.. లేదా ఇంజనీర్ చేస్తాడు.. మరీ డబ్బుంటే ఎంఎల్‌ఏని చేస్తాడు.. ఈ రౌడీని చేయడం ఏంటీ రా’ అని హీరోని ప్రశ్నిస్తే... ‘నెపోటిజం రా’ అంటూ అతను సమాధానం చెప్పడంతో టీజర్ ముగుస్తుంది. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్లపై కోనా వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీని మాత్రం టీజర్‌లో ప్రకటించలేదు.Untitled Document
Advertisements