IPL 2021: పాయింట్ల పట్టికలో చిట్టచివరలో హైదరాబాద్

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 06:53 PM

IPL 2021: పాయింట్ల పట్టికలో చిట్టచివరలో హైదరాబాద్

ఐపీఎల్ 2021 సీజన్‌లో హ్యాట్రిక్ విజయాల్ని సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 38 పరుగుల తేడాతో బెంగళూరు టీమ్ విజయం సాధించింది. దాంతో.. మొత్తం 6 పాయింట్లతో ఆ జట్టు నెం.1 స్థానానికి ఎగబాకింది. పంజాబ్ కింగ్స్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. కోల్‌కతాతో మ్యాచ్ ముందు వరకూ నెట్ రన్‌రేట్‌‌లో వెనకబడిన బెంగళూరు.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఒక్కసారిగా అన్ని జట్ల కంటే మెరుగైన నెట్ రన్‌రేట్‌ని సాధించడం గమనార్హం.

పాయింట్ల పట్టికలో ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టాప్-4లో కొనసాగుతున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనుండగా.. లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు ముగిసే సమయానికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధించనున్నాయి. పట్టికలో ఐదో స్థానంలో రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత వరుసగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. తాజా సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లు ముగియగా.. గెలుపు బోణి కొట్టని ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. ఆ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. మ్యాచ్‌లో ఒకవేళ చెన్నై గెలిస్తే..? పాయింట్ల పట్టికలో ఆ జట్టు నాలుగు నుంచి రెండో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది. కారణం.. ఢిల్లీ, ముంబయితో పోలిస్తే చెన్నైకి మెరుగైన నెట్ రన్‌రేట్ ఉండటమే.





Untitled Document
Advertisements