తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 07:49 PM

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి చెలరేగిపోతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చీఫ్ సెక్రటరీ సోమవారం ప్రెస్‌ నోట్ రిలీజ్ చేశారు. కేసీఆర్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని, వైద్యుల సూచన మేరకు ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారని సీఎస్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు జలుబు మాత్రమే ఉందని.. జ్వరం తగ్గిందని కేసీఆర్ వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదన్నారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నోముల భగత్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భగత్‌‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేత కోటి రెడ్డికి కరోనా సోకింది. నోముల భగత్, కోటిరెడ్డి ఇద్దరూ.. హాలియా బహిరంగ సభలో కేసీఆర్‌తో కలిసి సభా వేదికను పంచుకున్నారు. కోటిరెడ్డి కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న పలువురు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం కోవిడ్ బారిన పడినట్లు సమాచారం.

Untitled Document
Advertisements