బయో- సెక్యూర్ బుబల్‌లో ఉన్న సాహాకి పాజిటివ్

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:31 PM

బయో- సెక్యూర్ బుబల్‌లో ఉన్న సాహాకి పాజిటివ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ సాహా కరోనా వైరస్ బారినపడటం తనని ఆశ్చర్యపరిచిందని.. ఆ టీమ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. సీజన్ ఆరంభంలో మ్యాచ్‌లు ఆడిన సాహా.. ఆ తర్వాత పూర్తిగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కానీ.. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ స్థానంలో సాహాని ఓపెనర్‌గా ఆడించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ యోచించింది.

కానీ.. సాహా ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతని స్థానంలో మనీశ్ పాండేని ఓపెనర్‌గా ఆడించారు. మరుసటి రోజే సాహాకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిందే. సాహా‌కి కరోనా పాజిటివ్‌గా తేలిన నిమిషాల వ్యవధిలోనే ఐపీఎల్ 2021 సీజన్‌ని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

‘‘సాహా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం మ్యాచ్‌లో అతడ్ని ఓపెనర్‌గా ఆడించాలని అనుకున్నాం. కానీ.. శనివారం రాత్రి అతని ఆరోగ్యం దెబ్బతింది. దాంతో.. ఐసోలేషన్‌లో ఉంచాం. ఆ తర్వాత అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. టోర్నీ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సాహా వైరస్ బారినపడటం తనని ఆశ్చర్యపరిచింది’’ అని వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు.

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. అయితే.. ఐపీఎల్ జట్లలో వరుస కరోనా కేసులు నమోదవడంతో.. ఐపీఎల్ 2021 సీజన్‌ని నిరవధికంగా వాయిదా వేసిన బీసీసీఐ.. సెప్టెంబరులో టోర్నీని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Untitled Document
Advertisements