ఈటల అనుచరుడికి బ్యాంకు నోటీసులు

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:44 PM

ఈటల అనుచరుడికి బ్యాంకు నోటీసులు

ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం వేటు వేసినప్పటి నుంచి ఆయన వ్యవహారంలో రోజుకో పరిణామం జరుగుతూనే ఉంది. ఈటలపై వేటు పడిన రెండ్రోజులకు ఆయన్ను టార్గెట్ చేస్తూ మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు కొందరు విలేకరుల సమావేశాలు నిర్వహించి ఈటలపై దుమ్మెత్తిపోశారు. ఆయన కబ్జాలకు పాల్పడింది నిజమేనంటూ మాట్లాడారు.

మరోవైపు, ఈటల మాత్రం తన అనుచరులతో భవిష్యత్తు ప్రణాళికపై సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ పరిణామాన్ని బట్టి అధికార పార్టీ ఆయన అనుచరులను కూడా టార్గెట్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. మాజీ మంత్రి ఈటలపై ఇంత కాలంలేని ఆరోపణలు ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చి ఎలా ఇబ్బంది పెడుతున్నాయో.. ఆయన అనుచరులకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదంటూ చెబుతున్నారు.

ఈటల అనుచరుడు, వీణవంక జడ్పీటీసీ భర్త సాదవ రెడ్డికి కెడీసీసీ బ్యాంకు తాజాగా నోటీసులు పంపింది. ఆయన సింగిల్ విండో ఛైర్మెన్‌గా ఉన్న సమయంలో నిధులు గోల్‌మాల్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం రూ.18 లక్షల అవినీతి జరిగిందని గురువారం బ్యాంకు నోటీసులు పంపింది. అయితే.. ఈ నోటీసులపై ఇంతవరకూ సాదవ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈటలకు పార్టీలో గడ్డు కాలం ప్రారంభమైన నాటి నుంచి గత ఐదు రోజులుగా సాదవ రెడ్డి సన్నిహితంగా ఉంటున్నారు. ఇందుకే ఆయన్ను టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం చేసిందనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది. భవిష్యత్తులో ఇంకా ఎవరికి ఇలా జరుగుతుందో అని కరీంనగర్ జిల్లా నేతలు చర్చ నడుస్తోంది.





Untitled Document
Advertisements