కర్ణుడి అంగరాజ్యాధిపతిగా అభిషేకం

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:56 PM

కర్ణుడి అంగరాజ్యాధిపతిగా అభిషేకం

కరుపాండవులు దృతరాష్ట్రుడి కొలువులో తమ తమ విలువిద్యలు ప్రదర్శిస్తున్న సమయంలో అర్జునుడు తన అస్త్రశస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో కవచకుండలధారియైన కర్ణుడు మత్త గజంలా అడుగులు వేస్తూ రంగస్థలం మధ్యకు వచ్చి అర్జునుని శక్తిని ఆక్షేపించి, ద్రోణ కృపాచార్యుల అనుమతిపొంది " అర్జునా నీవు చూపిన ఈ విద్యలన్నీ నేను ప్రదర్శించగలను " అని అర్జునుడు చూపించిన అస్త్ర విద్యలనన్నింటినీ చక్కగా ప్రదర్శించి అందరి మన్ననలను పొందాడు. తరువాత " ఇంతకన్నా ఇంకా గొప్ప విద్యలు నా దగ్గర ఉన్నవి " అంటుండగా దుర్యోధనుడు తన సోదరులతో వచ్చి కర్ణుని కౌగలించుకుని మెచ్చుకున్నాడు. " ప్రియతమా! కర్ణా! మీ రాక మాకు చాల సంతోషంగా ఉన్నది. మా స్నేహితుడవై రాజభోగాలన్నీ మాతో అనుభవించు " అన్నాడు.
తరువాత కర్ణుడు అర్జునుని తనతో ద్వంద్వ యుద్దము చేయమని సవాలు చేయగా, అర్జునుడు కర్ణునితో యుద్దము చేయుటకు తలపడ్డారు. ప్రదర్శనను తిలకుస్తున్నా కుంతి భయంతో మూర్చపోయింది. అంత కృపాచార్యుడు వారి యుద్దమును ఆపుచేయించి రాజవంశజుడైన అర్జునునితో సూతకులస్థుడైన కర్ణుడు ద్వంద్వ యుద్దము చేయుటకు అర్హుడు కాదని చెప్పినాడు.
ఈ మాటకు దుర్యోధనుడు కోపోద్రిక్తుడై పాండవుల నోడించుటకు తనకు కర్ణుని స్నేహము అవసరమని భావించి, కృపాచార్యునితో " గురుదేవా! కర్ణుడు రాజు కాకపోవుటచేతనే కదా మీరు అభ్యంతరము పెట్టుచున్నది? రాజ్యము నేలువాడు ఎటువంటి వాడయినా రాజేకదా? అని ద్రుతరాష్ట్రుని అనుమతిని తీసుకొని అప్పటికప్పుడు కర్ణుని అంగరాజ్యాధిపతిగా అభిషేకించాడు.
దుర్యోధనుడు తనకు చేసిన మహోపకారమునకు ఆశ్చర్యం చెందినా కర్ణుడు ఆ సంతోషముతో "రాజా! నీవు నాకు కలుగజేసిన ఈ గౌరవమునకు ప్రత్యుపకారముగా ఏమివ్వగలను" అనగా "నీవంటి బల పరాక్రమవంతుడు నా జీవితమంతా స్నేహితునిగా ఉండాలనేది నా కోరిక. కనుక నీవు నా స్నేహితునిగా ఉండుటయే నాకు చేయగల ప్రత్యుపకారం" అని దుర్యోధనుడు సమాధానం ఇచ్చాడు.

Untitled Document
Advertisements