ద్రుపదుని భంగపాటు.. ద్రోణుడి పై ప్రతీకారచర్య

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 05:43 PM

ద్రుపదుని భంగపాటు.. ద్రోణుడి పై ప్రతీకారచర్య

ద్రోణాచార్యుడు ఒకనాడు రాకుమారులతో " బాలకులారా! మీ విద్యాభ్యాసం నేటితో పూర్తి అయినది. మరి నా గురుదక్షిణ చెల్లించండి " అని అడిగాడు. అందుకు వారు " ఏమి కావలెనో కోరుకోండి. గురుదేవా! తక్షణమే తెచ్చి ఇచ్చెదము " అన్నారు.
ద్రోణాచార్యుడు తన బాల్యస్నేహితుడైన ద్రుపదుని గురించి చెప్పి " ధనమదాంధుడైన ద్రుపదుని ప్రాణాలతో పట్టితెచ్చి మీ గురువుకు కానుకగా సమర్పించండి. అదే! మీరు మీ గురువు గారికిచ్చే అమూల్యదక్షిణ " అన్నాడు. అందుకు రాకుమారులు సంతోషముతో వెంటనే ఆ కార్యం సాధించి మీ ముందుంటాము అని సెలవు తీసుకున్నారు.
కౌరవ కుమారులందరూ సైన్యంతో పాంచాల దేశాన్ని ముట్టడించారు. కాని ద్రుపదుని ధాటికి నిలువలేక వట్టి చేతులతో వెనుదిరిగి వచ్చారు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుల వారికి నమస్కరించి, ఆశీస్సులు పొంది భీముని తోడ్కొని ద్రుపద సేనలను ఎదుర్కొన్నాడు. అర్జునుని ధాటికి ద్రుపదుని సేనలు చెల్లాచెదురయ్యాయి. అది గమనించిన ద్రుపదుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. భీముడొక పక్క పాంచాల సేనల గుండెలలో దడ పుట్టిస్తున్నాడు. అర్జునుడు ద్రుపదుడిని ఓడించి, తన రథానికి కట్టి తెచ్చి తన గురువైన ద్రోణాచార్యుల వారికి అప్పగించాడు.
ద్రోణాచార్యుడిని చూడగానే ద్రుపదుడు తలవంచుకున్నాడు. ద్రోణుడు పరిహసిస్తూ " గద్దేనధిరోహించిన ద్రుపద మహారాజా! చక్రవర్తి వైన నీవు ఈ గర్భ దరిద్రుని ఎదుట తలవంచుకొని నిలబడినావు. గర్వాంధుడవై, ధనమదాంధుడవై ఆనాడు ప్రేలావు. మరి ఇప్పుడు ఏమయింది? ఇకనైనా బుద్ది తెచ్చుకొని ధర్మమార్గములో నడుచుకో!" అని పరిహసించాడు. ద్రుపదుడు తన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకొన్నాడు. " ద్రుపదా! తప్పు తెలుసుకున్నావు అంతే చాలు" అని ద్రోణుడు క్షమించి ద్రుపడునికి అర్ద రాజ్యం ఇచ్చి పంపించి వేశాడు. తిరిగి వచ్చిన ద్రుపదుడు అవమాన భారంతో కృంగిపోయాడు. ద్రోణుని గెలవటం అసాధ్యమని తలచాడు. అర్జునుని పరాక్రమానికి ఆనందించాడు. ఎలాగైనా సరే ద్రోణుని మట్టుపెట్టాలని దుష్ట ఆలోచనచేసి ద్రోణుని చంపగల కుమారుని, అర్జునుని భర్త గా పొందగల కుమార్తెను యజ్న ఫలంగా పొందాలని తలచాడు. ఒక గొప్ప యాగం తలపెట్టి యాజుడు అనే విప్రునిచే యాగం పూర్తి చేయించి ద్రుపదుని భార్యకు హవిస్సును ఇస్తూ " దీనిని ఆరగిస్తే సంతానం కలుగుతుంది" అని చెపాడు. తరువాత వారికి ఇద్దరు సంతానం కలిగారు. వారు మగబిడ్డకు దుష్టద్యుమ్న అని, ఆడ బిడ్డకు కృష్ణ అని నామకరణం చేసారు.

Untitled Document
Advertisements