ధర్మరాజు పట్టాభిషేకం.. దుర్యోధనుని దుర్బుద్ధి

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 05:49 PM

ధర్మరాజు పట్టాభిషేకం.. దుర్యోధనుని దుర్బుద్ధి

పాండవ, కౌరవ రాకుమారులు యుక్తవయసుకు రాగానే దృతరాష్టుడు పెద్దవాడైపోయాడు. భీష్మాదులతో ఆలోచించి కౌరవ, పాండవ కుమారులలో పెద్దవాడు, ధర్మగుణ సంపన్నుడు, దయార్ద్రహృదయం అయిన ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం జరిపించాడు. ధర్మరాజు పెద్దవారి సలహాలు పాటిస్తూ ధర్మయుక్తంగా రాజ్య పాలన చేస్తూ ప్రజల మన్ననలు పొందటం దుర్యోధనాదులకు అవమానం అనిపించింది. పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు పరిపాలనలో పాండవుల ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది.
పాండవులు అందరి మన్ననలు పొందడం బరించలేని దుర్యోధనుడు దృతరాష్ట్రుని వద్దకు వెళ్లి " తండ్రి! దూరమాలోచించక ధర్మరాజును యువరాజుగా నియమించినారు. రాజోద్యోగులు, ప్రజలు కూడా నీ గొప్పతనమును గుర్తించక పాండవులనే కీర్తిస్తున్నారు. నీవు గ్రుడ్డివాడవు, బీష్ముడు బ్రహ్మచారి. మీరు వృద్దులగుటచేత మిమ్ములను ఎవరూ గౌరవించుటలేదు. మీకు లభించని గౌరవము మీ పుత్రులమైన మాకు మాత్రం ఏ విధంగా లభిస్తుంది. అందుచేత మేము కూడా ఆ పాండవులకు దాసులం కావలసి వస్తుంది. కాబట్టి ఎలాగైనా పాండవులను రాజ్యము నుండి పంపివేయాలి. అది మీ వల్లనే అవుతుంది" అని చెప్పగా దుర్యోధనుని మాటలకు శకుని వంత పలికాడు.
దుర్యోధనాదుల బాధను గ్రహించిన దృతరాష్ట్రుడు " అయితే ఇప్పుడు నన్నేమి చేయమంటావో చెప్పు నాయనా! ప్రజాభిమానము సంపూర్ణంగా పొందిన సరళ హృదయుడైన ధర్మరాజును ఏ కారణము చూపి పదవీచ్యుతునిగా చేయమంటావో చెప్పు?" అని అడిగాడు. అందుకు దుర్యోధనుడు నవ్వి " తండ్రీ! ఏదో ఒక వంకతో పాండవులను కొంతకాలము రాజ్యము నుండి దూరంగా పంపండి. వారు లేని ఆ కాలములో మేము రాజ్యభారము వహించి, ప్రజలను అన్నివిధాలా సంతృప్తులను జేసి వారి అభిమానము పొందెదము. ఆవిధంగా మన అదికారము స్థిరపడుటయే గాక మేము కీర్తిమంతులమవుతాము. ఆ తరువాత పాండవులు తిరిగి వచ్చినా మమ్ములనేమియు చేయలేరు. మీ కుమారులు ఔన్నత్యమును పొందవలెనని మీరు ఆశించినచొ ఇది ఒక్కటే మార్గము" అని చెపాడు.





Untitled Document
Advertisements