హోమియో వైద్యం...ఒకే కుటుంబంలో 8 మంది మృతి

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 08:19 PM

హోమియో వైద్యం...ఒకే కుటుంబంలో 8 మంది మృతి

చత్తీస్‌గఢ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బిలాస్‌పూర్‌ జిల్లాలో వైద్యం వికటించిన ఒకే కుటుంబంలోని ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స చేసిన వైద్యుడు పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హోమియోపతి ఔషధాలే ఈ మరణాలకు కారణమని బిలాస్‌పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఈ ఔషధాల్లో ఆల్కహాల్ ఉండటమే కారణమని అన్నారు.

ద్రొసరే-30 అనే ఈ ఔషధం తయారీలో ఆల్క్‌హాల్‌కు బదులు నాటుసారాను వినియోగించారని తెలిపార. హోమియోపతి చికిత్సలో ఈ ఔషధాన్ని గొంతునొప్పి, జలుబు వంటి ఇబ్బందులతో బాధపడుతున్నవారికి వినియోగిస్తారు. కోవిడ్ సమయంలో జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉండటంతో చత్తీస్‌గఢ్ వైద్యుడు దీనిని ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేలా విచారం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆయన ఆదేశించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సిరిగిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్మి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నలుగురు బాధితులు చనిపోగా.. మిగతా నలుగురు బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. బాధితులు కమలేశ్ ధూరి (32) అక్షయ ధూరి (21), రాజేశ్ ధూరి (21), సామ్రూ ధూరి (25)లు ద్రోసరే-30 ఔషధం తీసుకున్నట్టు తెలిపారు. ఇదే ఔషధం తీసుకున్న ఖేమ్‌చంద్ ధూరి (40), కైలాశ్ ధూరి (50), దీపక్ ధూరి (30)‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

అయితే, మంగళవారం మృతిచెందినవారికి కోవిడ్ ఉందనే అనుమానంతో అధికారులకు తెలియకుండా కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం అక్కడకు చేరుకున్న పోలీసులు.. అస్వస్థత గురైన మరో ఐదుగుర్ని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగుర్ని చత్తీస్‌గఢ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు, ఇంకొకర్ని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.





Untitled Document
Advertisements