ఘనంగా 'రిలయన్స్‌ ఫ్యామిలీ డే' వేడుకలు

     Written by : smtv Desk | Sun, Dec 24, 2017, 01:25 PM

ఘనంగా 'రిలయన్స్‌ ఫ్యామిలీ డే' వేడుకలు

ముంబై, డిసెంబర్ 24 : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) ...ప్రస్తుత భారత్ విపణిలోనే అగ్రగామిగా ఒక వెలుగు వెలుగుతున్న సంస్థ...కానీ ఈ సంస్థ అభివృద్ధి కోసం ముకేష్ అంబానీ తండ్రి దివంగత ధీరూభాయ్‌ అంబానీ ఎన్నో కష్టాలు పడి, శ్రమనే పెట్టుబడిగా పెట్టి నడిపించారు. తాజాగా ఈ కంపెనీ ఏర్పడి 40 వసంతాలు పూర్తి చేసుకోవడమే కాకుండా, మరోవైపు తాను ఈ స్థాయికి ఎదగడానికి తొలి అడుగులు నేర్పించిన తండ్రి ధీరూభాయి అంబానీ జయంతి (28న) ఇంకో నాలుగు రోజుల్లో జరగనుంది. అందుకే ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని ఓ చిరస్మరణీయ వేడుకకు శ్రీకారం చుట్టారు ముకేశ్‌ అంబానీ. ఆ వేడుక పేరు 'రిలయన్స్‌ ఫ్యామిలీ డే'. 'ఓ కుటుంబం కలిసి పనిచేస్తుంది.. కలిసి వేడుకలు చేసుకుంటుంది' అని ట్యాగ్ లైన్. శనివారం ఈ కార్యక్రమ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

ముకేశ్‌ నిర్వహిస్తోన్న ఇంతటి వేడుకకి వేదిక నవీ ముంబయిలోని రిలయన్స్‌ కార్పొరేట్‌ పార్క్‌లో నిర్మించిన కొత్త మైదానం. ఇక్కడ విశేషమేమిటంటే లండన్‌లోని లార్డ్స్‌ మైదానం కంటే ఇది పెద్దది. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా 1200 ప్రదేశాల్లోని తన ఉద్యోగులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే వెసులుబాటును కూడా రిలయన్స్‌ గ్రూపు కల్పించడం గమనార్హం. ఈ వేడుకకు ముకేశ్‌ తల్లి కోకిలాబెన్‌. భార్య నీతా అంబానీ, కుమార్తె ఈశా, తనయులు ఆకాశ్‌, అనంత్‌ సహా ముకేశ్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అంతే కాకుండా బాలీవుడ్‌ సూపర్‌స్టార్లు అమితాబ్‌ బచ్చన్‌, షారూక్‌ ఖాన్‌ తమ ప్రసంగంతో అలరించారు.

ధీరుభాయ్‌ దార్శనిక త, లక్ష్యాలు, సూత్రాలకు రిలయన్స్‌ గ్రూప్‌ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ముకేశ్‌ అన్నారు. రూ. 1,000తో ప్రారంభమైన కంపెనీ నేడు రూ. 6 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది. 1977లో ఆర్‌ఐఎల్‌లో రూ. 1,000 పెట్టుబడి చేసిన వారి ప్రస్తుత విలువ 2009 రెట్లు పెరిగి రూ. 20.9 లక్షల స్థాయికి ఎదిగింది. ప్రపంచంలోని టాప్‌ 20 కంపెనీల్లో రిలయన్స్‌ను నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు.





Untitled Document
Advertisements