"ఒక వ్యక్తిని చంపాలంటే ఇది మార్గం కాదు"

     Written by : smtv Desk | Fri, Sep 24, 2021, 11:58 AM


సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు మరణంపై నేటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజుని పోలీసులే హత్య చేసి.. పట్టాలపై పడేశారని అతని కుటుంబం ఆరోపిస్తోంది. పౌరహక్కుల సంఘం నేత హైకోర్టుని సైతం ఆశ్రయించారు. పోలీసులే చంపేశారని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించడంతో కోర్టు జ్యుడీషియల్ విచారణకు కూడా ఆదేశించింది. అయితే రాజు మరణం హత్య అంటే వాళ్లు బుద్ధి తక్కువ వాళ్లేనని స్ట్రాంగ్‌గా చెబుతున్నారు ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ నారాయణ రెడ్డి. రైలు పట్టాలపై రాజు మృతదేహం పడి ఉన్న తీరు.. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను ఆయన అనాలసిస్ చేశారు. ఓ చానల్ ఇంటర్వ్యూలో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడు రాజుపై అభియోగాలు ఉన్నాయని.. అనూహ్యంగా అతను రైలు పట్టాల నడుమ శవమై కనిపించాడని నారాయణ రెడ్డి తెలిపారు. రాజు మరణం ఎలా జరిగి ఉండొచ్చు.. అలాగే జరిగేందుకు ఉన్న అవకాశాలపై ఆయన చర్చించారు. రాజుని స్థానికులు గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించడంతో రైలు పట్టాలపైకి పారిపోయి ఉండొచ్చని ఆయన అన్నారు. ‘రాజు శరీరం పట్టాల మధ్యలో ఉంది. పట్టాలకు అడ్డంగా లేదు. కాళ్లు, మొండెం, ఎడమ చేయికి గాయాల్లేవు. ముఖం, కుడిచేతిపై మాత్రమే గాయాలున్నాయి. పట్టాలపై ఎలాంటి రక్తపు మరకలు లేవు. రెండు పట్టాల మధ్య ప్రాంతంలో రక్తపు మరకలు ఉండడంతో ట్రైన్ వెనక నుంచి తగిలినట్లు తెలుస్తోంది. అలా కాకుంటే శవం పడి ఉన్న తీరు ప్రకారం.. కిందపడుకుని ఉంటే ఎవరైనా పెద్ద రాయి తలపై వేసి ఉండాల్సింది. కానీ ఆ చాన్స్ లేదని’ నారాయణ రెడ్డి చెప్పారు. అలాంటి ఆనవాళ్లు sఅక్కడ లేవని అన్నారు.

ఈ కేసులో రాజుని పోలీసులు చంపారనడమంటే అంతకంటే బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదని నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. స్థానికుల నుంచి అతను ఎలా తప్పించుకోవాలో తేల్చుకునే లోపే ట్రైన్ వచ్చి గుద్ది ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రాజు ఒంటిపై గాయాలను ఆయన విశ్లేషించారు. కింది దవడ పగిలిపోవడం.. నాలుక కూడా కట్ అయినట్టు ఉందని ఆయన తెలిపారు. ఒక వ్యక్తిని చంపాలంటే ఇది మార్గం కాదని.. అతన్ని ఎవరో చంపారు అనేందుకు ఆస్కారం లేదన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాల మధ్యకు పోయి ఉండొచ్చని.. అడ్డుగా పడుకునేలోపే ట్రైన్ వేగంగా వచ్చి తలకి తగిలి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే అతని తల, కుడివైపు మాత్రమే దెబ్బలు కనిపిస్తున్నాయని అన్నారు. అతన్ని ఎవరూ హత్య చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అతని చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా అతన్ని గుర్తించారని చెప్పారు. చిన్నారి కేసులో అతనే హత్యాచారం చేశాడా? లేదా అనే విషయం తేలాలంటే డీఎన్‌ఏ టెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. పోస్టుమార్టం సమయంలో ప్రైవేట్ పార్ట్స్‌ నుంచి సేకరించిన భాగాన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపాలన్నారు. అమ్మాయి మానంలో దొరికిన డీఎన్‌ఏ, నిందితుడి ఎముకలో దొరికిన డీఎన్‌ఏ ఒకేలా ఉంటే అతనే అత్యాచారం చేశాడని చెప్పొచ్చని ఆయన అన్నారు. ఒకవేళ అమ్మాయి బాడీ నుంచి సేకరించిన పార్ట్స్‌ని పరిశీలించి.. ఇతని ఎముకలో ఉండే డీఎన్‌ఏతో పోల్చాలన్నారు. ఒకవేళ హత్యాచారం చేసినట్లు తేలినా.. ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి కేసు క్లోజ్ అయిపోతుందని నారాయణ రెడ్డి చెప్పారు.





Untitled Document
Advertisements