ఔటా? కాదా?

     Written by : smtv Desk | Sat, Oct 02, 2021, 02:03 PM

ఔటా?  కాదా?

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో నిన్న‌ జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు మూడు వికెట్ల తేడాతో నెగ్గిన విష‌యం తెలిసిందే. అయితే, పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్ బ్యాటింగ్ చేస్తోన్న స‌మ‌యంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తీరు వివాదాస్పదం అవుతోంది. 18.3 ఓవర్‌కు శివమ్‌ మావీ వేసిన బంతిని భారీ షాట్ కొట్ట‌డానికి కేఎల్ రాహుల్ ప్ర‌య‌త్నించాడు.

అయితే, రాహుల్‌ త్రిపాఠి పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకోవ‌డంతో దానిపై అంపైర్లకు స్పష్టత రాలేదు. ఔటా? కాదా? అన్న నిర్ణ‌యాన్ని థర్డ్‌ అంపైర్‌కు వ‌దిలేశారు. దీంతో చివరికి కేఎల్‌ రాహుల్‌ నాటౌట్‌ అని థ‌ర్డ్ అంపైర్ తేల్చారు. దీనిపై మాజీ క్రికెట‌ర్ గౌతమ్‌ గంభీర్ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని, కీలకమైన నిర్ణయాలు క్రికెట్ జట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు.

కేఎల్‌ రాహుల్ ఔటైన‌ట్లు చాలా స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. స్లో మోషన్ లో చూడ‌క్కర్లేకుండానే ఔటైనట్లు స్పష్టమ‌వుతోంద‌ని అన్నారు. ఈ మ్యాచ్‌లో ఔట్‌ ఇచ్చి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని చెప్పారు. పంజాబ్ జ‌ట్టు చివరి ఓవర్లలో ఎదుర్కొన్న ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను గ‌తంలోనూ చూశామ‌ని అన్నారు.





Untitled Document
Advertisements