శ్రీరామునిచే వాలి వధ!

     Written by : smtv Desk | Wed, Oct 06, 2021, 06:54 PM

శ్రీరామునిచే వాలి వధ!

శ్రీరాముని అండ చూసుకొని సుగ్రీవుడు కిష్కింధకు చేరి, వాలి వద్దకు పోయి యుద్ధానికి రమ్మని కవ్వించి తొడలు చరిచాడు. పిరికిపంద వలే పారిపోయిన సుగ్రీవుడు తిరిగివచ్చి తొడలు చరచడం చూసి వాలికి అనుమానం ఆశ్చర్యం కలిగింది. అయినా ఈసారి సుగ్రీవుని చావు తప్పదు అనుకుని గద తీసుకుని వాలి యుద్ధము చేయుటకు బయటకు వచ్చాడు. సోదరులు వాలిసుగ్రీవుల ఇద్దరూ భీకరంగా యుద్ధం చేస్తున్నారు. వాలి పిడిగుద్దులకు సుగ్రీవుడు భరించలేక పోతున్నాడు. వాలి సుగ్రీవుల యుద్ధం చేయుచుండగా వారిద్దరూ ఒకే పోలికతో ఉండుటచే వారిలో ఎవరు సుగ్రీవుడు, ఎవరు వాలి రాముడు తెలుసుకోలేకపోయాడు. ఆ యుద్ధంలో సుగ్రీవుడు చావు దెబ్బలు తిన్నాడు. ఆ రోజు యుద్ధం ఆగిపోయింది. జరిగిన విషయం తెలియజేసి రాముడు సుగ్రీవుడిని ఓదార్చాడు. వాలిని సులభంగా గుర్తించడానికి సుగ్రీవుని మెడలో రాముడు పూలమాల వేశాడు. మరునాడు యుద్ధం ప్రారంభమైంది. అన్నదమ్ములు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. వాలి దాటికి సుగ్రీవుడు నిలబడడం సాధ్యం కావడం లేదు. రాముడు ఈ విషయం గ్రహించి చెట్టు చాటు నుండి బాణం వదిలాడు. అది వాలి గుండెల్లో దూసుకుపోయింది. వాలి నేల కూలిపోయాడు. రామబాణం గుండెల్లో గుచ్చుకుని వాలి బాధతో తల్లడిల్లిపోతున్నాడు. రాముడు వాలిని సమీపించాడు. " రామా ! నీవు కూడా ధర్మ విరుద్ధమైన పని చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను" అన్నాడు వాలి. అందుకు శ్రీరాముడు మందహాసం చేస్తూ" ఓ వానర యోధుడా! నీకు ఆపద సంభవించినది అని ఇతరులను నిందించుట తప్పు. నీ కంఠమునందు ధరించిన మణిమాల ఇంద్రుడు మీ తాతగారికి ఇచ్చినది. దాని ప్రభావము వలన ఎదుటి వారి శక్తి సగం క్షీణింప చేస్తుంది. కనుకనే చెట్టు చాటునుండి సంహరించ వలసి వచ్చినది. అదీగాక నీవు మృగజాతికి సంబంధించిన వాడవు. కనుకనే తేటధర్మం అనుసరించాను. మరొక ఘోరమైన తప్పు నీ తమ్ముడి భార్య నీకు పుత్రికతో సమానం అయినటువంటి ఆమెను చెరబట్టిన కాముకుడివి. అందువలన నీవు మహాపాపివైనావు. నీ తమ్ముడిని రాజ బహిష్కారం చేయడం ద్రోహంకాదా! ద్రోహులను తగినట్లుగా శిక్షించడం రాజధర్మం" అన్నాడు రాముడు.
" రామా! నన్ను క్షమించు. నేను చేసిన పని తప్పు అని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ చేతిలో మరణం సంభవించడంతో నా జన్మ ధన్యత చెందింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది" అని రామునికి నమస్కరించి వాలి కన్నుమూసాడు. సోదరుడి మరణం చూసిన అంగద, సుగ్రీవులను ఓదార్చారు రామలక్ష్మణులు. వాలి దహన సంస్కారాలు పూర్తి చేయించి, సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిపించుటకు శుభ ముహూర్తం నిర్ణయించారు. అందుకు వానరవీరులు అంతా సంతోషించారు.

Untitled Document
Advertisements