SRHపై 42 పరుగుల తేడాతో గెలిచిన ముంబయి...రెండు జట్లు ఇంటికే

     Written by : smtv Desk | Sat, Oct 09, 2021, 11:08 AM

SRHపై 42 పరుగుల తేడాతో గెలిచిన ముంబయి...రెండు జట్లు ఇంటికే

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ఓటమితో ముగిసింది. అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన సీజన్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆధిపత్యం చెలాయించిన ముంబయి ఇండియన్స్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ.. నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబయి ఇండియన్స్ నిష్క్రమిస్తూ ఇంటిబాట పట్టగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చివరి ప్లేఆఫ్స్ బెర్తుని దక్కించుకుంది. అలానే చివరి మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్ కూడా ఇంటిబాట పట్టింది. ఆదివారం నుంచి చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా మధ్య ప్లేఆఫ్స్ మ్యాచ్ జరగనున్నాయి.

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (84: 32 బంతుల్లో 11x4, 4x6), సూర్యకుమార్ యాదవ్ (82: 40 బంతుల్లో 13x4, 3x6) విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడటంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే.. ఈ క్రమంలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు తీశారు. ఉమ్రాన్‌ మాలిక్ కూడా ఒక వికెట్ దక్కింది.

236 పరుగుల భారీ ఛేదనలో హైదరాబాద్ ఓపెనర్లు జేసన్ రాయ్ (34: 21 బంతుల్లో 6x4), అభిషేక్ శర్మ (33: 16 బంతుల్లో 4x4, 1x6) దూకుడుగా ఆడగా.. మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన మనీశ్ పాండే (69 నాటౌట్: 41 బంతుల్లో 7x4, 2x6) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కానీ.. మిడిలార్డర్ నుంచి ప్రియమ్ గార్గె (29: 21 బంతుల్లో 2x4, 1x6) మినహా పెద్దగా సహకారం అతనికి లభించలేదు. దాంతో.. హైదరాబాద్ చివరికి 8 వికెట్ల నష్టానికి 193 పరుగులే చేయగలిగింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ని 170+ పరుగుల తేడాతో ముంబయి ఓడించి ఉంటే..? అప్పుడు కోల్‌కతాకి బదులుగా ముంబయి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించేది.





Untitled Document
Advertisements