ఈజీగా చేసుకునే అరటికాయ - క్యారెట్‌ గారెలు!

     Written by : smtv Desk | Fri, Nov 05, 2021, 04:14 PM

ఈజీగా చేసుకునే అరటికాయ - క్యారెట్‌ గారెలు!

అరటికాయ, క్యారెట్ శరీరానికి ఎంత మేలు చేస్తాయో మనందరికీ తెలుసు. విడివిడిగా తింటేనే ఎన్నో పోషకాలను పొందుతాము. అలాంటి కలిపి తింటే ఇంకెంత లాభమో చెప్పాల్సిన అవసరం లేదు. అదికూడా గారెల రూపంలో తీసుకుంటే.. ఎవ్వరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అరటికాయ- క్యారెట్‌ గారెల తయారీ విధానం కూడా సులభంగా ఉంటుంది. పిల్లలకు మంచి ఆరోగ్యం కూడా. స్కూల్ నుంచి రాగానే ఇష్టంగా తినే ఈ స్నాక్ తయారీ విధానాన్ని చూద్దామా..
కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ (తొక్కతో పాటు)- ఒకటి, బియ్యం పిండి - కప్పు, క్యారెట్‌ తురుము - కప్పు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - పది, పచ్చిమిర్చి - ఐదు, కొత్తిమీర తురుము - అరకప్పు, ఉప్పు - తగినంత, జీలకర్ర - చెంచా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం
* ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసుకోవాలి.
* తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారెట్‌ తురుము, తగినంత బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి.
* ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి.
* ఈ మిశ్రమాన్ని గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ క్యారెట్‌ గారెలు రెడీ అయినట్లే.. సాయంత్రపు స్నాక్స్‌గా వీటిని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. టమాటా సాస్‌తో తింటే మరింత రుచి వీటి సొంతం... చేసేయండి మరి.





Untitled Document
Advertisements