టీ20ల్లో చాహల్‌కి నో ఛాన్స్! న్యూజిలాండ్ స్పిన్నర్ విమర్శలు

     Written by : smtv Desk | Fri, Nov 19, 2021, 12:08 PM

టీ20ల్లో చాహల్‌కి నో ఛాన్స్! న్యూజిలాండ్ స్పిన్నర్ విమర్శలు

భారత మణికట్టు స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్‌‌ని టీమిండియా మేనేజ్‌మెంట్ పక్కన పెట్టడంపై న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డ్యానియల్ వెటోరీ మండిపడ్డాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం రాత్రి జైపూర్ వేదికగా ఫస్ట్ టీ20 మ్యాచ్ జరగగా.. ఈ మ్యాచ్‌లో చాహల్‌కి అవకాశమివ్వని టీమిండియా మేనేజ్‌మెంట్.. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కి తుది జట్టులో చోటిచ్చింది. మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన అశ్విన్ 23 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

వాస్తవానికి గత కొంతకాలంగా చాహల్‌కి టీ20ల్లో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో అతనికి చోటివ్వని భారత సెలెక్టర్లు.. న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కి మాత్రం ఎంపిక చేశారు. కానీ.. ఫస్ట్ టీ20లో అతను రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో నిలకడగా రాణించిన ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కి ఈ ఫస్ట్ టీ20లో చోటిచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్.. అదే ఐపీఎల్‌లో చక్కగా వికెట్లు తీసిన చాహల్‌ని పక్కనపెట్టడం బాధాకరమని వెటోరీ చెప్పుకొచ్చాడు.

‘‘ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశమిచ్చారు. కానీ.. అదే కోణంలో చాహల్‌కి ఎందుకు అవకాశమివ్వడం లేదు. అశ్విన్ ఎలా బౌలింగ్ చేయగలడో మనందరికీ తెలుసు. కానీ.. 2022 టీ20 వరల్డ్‌కప్‌‌‌లో అశ్విన్‌కి తుది జట్టులో చోటివ్వగలరా? కానీ.. చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్‌ 2021లో కోహ్లీ అతడ్ని వికెట్ టేకింగ్ బౌలర్‌గానే చూశాడు. ఇప్పుడు టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్లలో చాహల్ కూడా ఒకడు. అతను బంతిని చక్కగా టర్న్ చేయగలడు.. అలానే స్టంప్స్‌కి అటాక్ చేయగలడు. కాబట్టి.. భారత్ జట్టులో ఉండేందుకు అతను అర్హుడు’’ అని వెటోరీ చెప్పుకొచ్చాడు.

Untitled Document
Advertisements