అమిత్ షా నుంచి ఫోన్...ఢిల్లీ బయలుదేరనున్న తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు

     Written by : smtv Desk | Wed, Dec 08, 2021, 02:53 PM

అమిత్ షా నుంచి ఫోన్...ఢిల్లీ బయలుదేరనున్న తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో అమిత్ షా రేపు భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోని అమిత్ షా కార్యాలయం నుంచి నేతలకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు ఢిల్లీ బయలేదేరి వెళ్లనున్నారు.

ఈ రోజు రాత్రికి నేతలు హస్తినకు చేరుకుంటారు. రేపు ఉదయం 9 గంటలకు అమిత్‌ షాతో సమావేశం జరగనుంది. రేపు అందుబాటులో ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు బీజేపీ వర్గాల సమాచారం. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

సమావేశంలో 2023 ఎన్నికలే అజెండాగా కీలక నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, బీజేపీ పాదయాత్ర, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై అమిత్‌ షాతో నేతలు చర్చించే అవకాశముంది. ఈ సమావేశంలో ఇటీవల పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమ నేత విఠల్, జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను అమిత్ షాకు పరిచయం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేంద్రంపై కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో అమిత్ షాతో బీజేపీ నేతల భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.





Untitled Document
Advertisements