వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకుంటే జీతం, ఉద్యోగాలు కట్

     Written by : smtv Desk | Wed, Dec 22, 2021, 05:13 PM

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకుంటే జీతం, ఉద్యోగాలు కట్

కరోనాతో వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఎంజాయ్ చేస్తోన్న ఉద్యోగులకు కొత్త చిక్కు వచ్చి పడింది. మీరు ఎక్కడి నుంచి పనిచేసినా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందేనని టెక్ దిగ్గజాలు వార్నింగ్‌లు ఇస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకుని, తమకు వ్యాక్సిన్ సర్టిఫికేట్ సమర్పించాలని, లేదంటే జీతమివ్వమని, ఉద్యోగం తీసేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేయగా.. తాజాగా చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా తన ఉద్యోగులకు ఈ విషయాన్ని నోటిఫై చేసింది. ఈ రెండు కంపెనీలు మాత్రమే కాక, మరికొన్ని ఐటీ కంపెనీలు కూడా ఐటీ ఉద్యోగులకు ఈ మేరకు వార్నింగ్‌లు ఇచ్చాయి.

ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు, వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ సర్టిఫికేట్‌ను జనవరి 4వ తేదీ వరకు తమకు సమర్పించాలని చిక్ దిగ్గజం ఇంటెల్ సూచించింది. ఒకవేళ అలా చేయని పక్షంలో అన్‌పెయిడ్ లీవ్(జీతం లేని సెలవును) పెట్టుకోవాలని చెప్పింది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనవరి 4 వరకు తుది గడువు పెట్టిన ఇంటెల్, ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఏదైనా మినహాయింపులుంటే కూడా ఈ తేదీ లోపలే తెలుపాలని సూచించింది. ఉద్యోగుల వ్యాక్సిన్ మినహాయింపు అభ్యర్థనలను ఇంటెల్ మార్చి 15 వరకు రివ్యూ చేయనుంది.

గూగుల్ కంపెనీ కూడా పూర్తి తరహాలో వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు జీతాలు కోత విధిస్తామని హెచ్చరించింది. అమెరికా అడ్మినిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన కోవిడ్-19 నిబంధనలను తప్పక పాటించాలని చెప్పింది. వ్యాక్సిన్ వేయించుకోవడంలో విఫలమైతే 30 రోజుల అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌ను గూగుల్ ఆపర్ చేస్తుంది. ఆ 30 రోజుల తర్వాత కూడా ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకోకపోతే, ఆరు నెలల వరకు జీతం లేని సెలవును ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తామని తన ఇంటర్నల్ మెమోలో తెలిపింది.

వంద మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్నా కంపెనీలలో, జనవరి 18 వరకు ఉద్యోగులు పూర్తిగా వ్యాక్సినేట్ అయి ఉండాలని అమెరికా అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు టెక్ దిగ్గజాలు ఉద్యోగులకు ఈ సూచనలు చేస్తున్నాయి. గూగుల్ తన కంపెనీలో పనిచేస్తోన్న లక్షన్నర ఉద్యోగులకు వ్యాక్సినేషన్ స్టేటస్‌ను తమ ఇంటర్నల్ సిస్టమ్స్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించింది.

ఉద్యోగుల విషయంలోనే కాక, కొత్తగా రిక్రూట్ చేసుకునే ఉద్యోగుల విషయంలో కూడా ఐటీ కంపెనీలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. రిక్రూట్‌మెంట్ సమయంలోనే వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను అడుగుతున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోని వారికి ప్రస్తుతం ఉద్యోగం దొరకడం కూడా కష్టంగా మారుతోంది. ఇదిలా ఉంటే, హైదరాబాద్‌లోని పలు ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగులను వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను అడుగుతున్నాయి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ విషయంలో కంపెనీలు అసలు రాజీ పడటం లేదు.





Untitled Document
Advertisements