ఏపీలో థియేటర్లపై అధికారుల ఉక్కుపాదం...పలు థియేటర్లు సీజ్‌

     Written by : smtv Desk | Wed, Dec 22, 2021, 07:10 PM

ఏపీలో థియేటర్లపై అధికారుల ఉక్కుపాదం...పలు థియేటర్లు సీజ్‌

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సినిమా థియేటర్లపై పోలీసులు, అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సినిమా ప్రదర్శనలో నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను బుధవారం అధికారులు సీజ్‌ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు, అవనిగడ్డ, గుడివాడలో ఈ మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ టిక్కెట్ల ధరలు, ఫుడ్‌ స్టాల్స్‌లో ధరలపై అధికారులు ఆరా తీశారు.

ఈ సందర్భంగా థియేటర్ల నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పెద్ద ఎత్తున థియేటర్లను సీజ్ చేశారు.

కృష్ణా జిల్లాలో తనిఖీలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ మాధవీలత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 12 థియేటర్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు. లైసెన్సులు రెన్యువల్ చేయని థియేటర్లు సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీలు రెగ్యులర్‌గా కొనసాగుతాయని చెప్పారు. థియేటర్ల నిర్వాహకులు బెనిఫిట్ షో వెయ్యాలంటే తప్పకుండా అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పారు.

థియేటర్లలో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం తనిఖీలు చేస్తారని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. పెద్ద హీరోల సినిమాలకు ఏ థియేటర్‌లో అయినా రేట్లు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. థియేటర్లలో తిను బండరాలు, పార్కింగ్ విషయంలో థియేటర్ల యాజమాన్యాలు దోపిడీకి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత పేర్కొన్నారు. దీంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements