ఇకపై ఈ మందులకు ప్రిస్క్రిప్షన్ లేకపోయినా పర్లేదు

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 05:02 PM

ఇకపై ఈ మందులకు ప్రిస్క్రిప్షన్ లేకపోయినా పర్లేదు

ఇప్పటి వరకు మందుల దుకాణానికి వెళ్లి ఏదైనా మందులు కొనుగోలు చేయాలంటే ముందస్తుగా డాక్టర్ సూచన, ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం అవసరం. కానీ ప్రస్తుతం సామాన్య ప్రజల సౌకర్యార్థం గవర్నమెంట్ ఈ రూల్స్‌ను మారుస్తోంది. ప్రభుత్వం రూల్స్ మార్చిన తర్వాత.. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ 16 రకాల మెడిసిన్లను ఎవరైనా సరే మెడికల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. డ్రగ్, కాస్మోటిక్ రూల్‌ను మార్చాలని ప్రస్తుతం ప్రభుత్వం చూస్తున్నట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. ఈ డ్రాఫ్ట్ లో 16 రకాల మెడిసిన్లను ప్రతిపాదించింది.
ఈ 16 రకాల మెడిసిన్లలో పారాసిటమల్ 500, కొన్ని లాక్సాటివ్స్, ఫంగల్ క్రీమ్‌లున్నాయి. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి సలహాలను, సూచనలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరుతోంది. నెల వ్యవధిలో ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి సలహాలను, సూచనలను స్వీకరించి.. ఈ నిబంధనలకు ఒక తుది రూపం తీసుకురానుంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం చాలా మెడిసిన్లు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ స్టోర్లలో అందుబాటులో ఉంటున్నాయి. కానీ వాటికంటూ ఒక నిర్దిష్టమైన చట్టం కానీ, నిబంధన కానీ లేదు.
ఓటీసీ డ్రగ్స్ విషయంలో ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రభుత్వ ప్రతిపాదనను డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మెడిసిన్ల విషయంలో ప్రభుత్వానికి ఈ ఆర్గనైజేషన్ తన సలహాను కూడా ఇచ్చింది. ఈ ఆమోదం తెలిపిన తర్వాత ఓటీసీ కేటగిరీ డ్రగ్స్ విషయంలో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ప్రస్తుతం 16 డ్రగ్స్‌కు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. త్వరలోనే ఈ జాబితాలో మరిన్ని మెడిసిన్లను చేర్చనుంది. ఓటీసీ కేటగిరీ డ్రగ్స్ అనేవి హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ నుంచి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా కస్టమర్లకు నేరుగా విక్రయించే మెడిసిన్లు.
అయితే ఓటీసీ(ఓవర్ ది కౌంటర్) కేటగిరీ మెడిసిన్లను విక్రయించే విషయంలో ప్రభుత్వం కొన్ని షరతులను విధించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఓటీసీ కేటగిరీ కింద మెడికల్ స్టోర్లు ఐదు రోజులకు మాత్రమే ఈ మెడిసిన్లను విక్రయించాలి. మెడిసిన్ తీసుకున్న ఐదు రోజులకు కూడా పేషెంట్ కోలుకోకపోతే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ప్రతి ప్యాక్‌పై ఈ సమాచారం ఉంటుంది. అంతేకాక డోసేజ్‌ను కూడా ఐదు రోజులకు మించి మెడికల్ స్టోర్లు విక్రయించవు అనే విషయాన్ని ప్రభుత్వం వారు స్పష్టం చేయనున్నారు.

Untitled Document
Advertisements