రైతుబంధు డబ్బులు ఆకౌంట్లో జమయ్యేది ఎప్పుడంటే?

     Written by : smtv Desk | Mon, Jun 20, 2022, 12:00 PM

రైతుబంధు డబ్బులు ఆకౌంట్లో జమయ్యేది ఎప్పుడంటే?

వానాకాలం సీజన్ పంటలకు రైతన్నలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నప్పుడు, వారికి పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు డబ్బుల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధు అందించేందుకు కేసీఆర్ సర్కారు సిద్ధమవుతోంది. నిజానికి జూన్ మొదటి వారం నుంచే రైతుబంధు ఇవ్వాలని అనుకున్నా.. ఆర్థిక సమస్యల కారణంగా 15వ తేదీ ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. కానీ అప్పటికీ నిధులు సర్దుబాటుకాక సమయాన్ని పొడిగించారు.
ప్రస్తుతం పలు రుణ సంస్థల నుంచి కొత్త అప్పులు వస్తుండటం, రాష్ట్ర ఆదాయం నుంచి కూడా నిధులు సర్దుబాటు చేసి రైతు బంధు పంపిణీని చేపట్టాలని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 20 తర్వాత రైతుబంధు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
కేసీఆర్ కలల పథకంగా 2018లో రైతుబంధు స్కీమ్ మొదలైనప్పుడు మే నెలలోనే రైతులకు డబ్బులు అందజేశారు. ఆ తర్వాత కొన్ని సీజన్లలో పెట్టుబడి సాయం అందించడం కాస్త ఆలస్యమైంది. వానాకాలం అయితే జూన్ జూలైలో, యాసంగి పంటలకైతే జనవరి, ఫిబ్రవరి నెలల్లో రైతుబంధు ఇస్తున్న ప్రభుత్వం.
గత యాసంగి సీజన్ నాటికి 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. 152.91 లక్షల ఎకరాల రైతులకు యాజమాన్యం హక్కులు లభించాయి. అందులో 62.99 లక్షల మంది రైతులకు రూ.7వేల 411.52 కోట్లకు పైగా రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించింది.
ఈ 2022 జూన్ సీజన్ లో పట్టాదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈసారి రైతుబంధు కోసం రూ.7,700 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఏకమొత్తం ఒకేసారి వేస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో.. విడతల వారీగా ఈ నెల 20వ తేదీ తర్వాత రైతుబంధును అందించనుంది ప్రభుత్వం.
బీజేపీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించిన తర్వాత కేంద్రం నుంచి తెలంగాణకు ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడం అటుంచితే, రాష్ట్రం తీసుకోవాలనుకున్న అప్పులకు సైతం కేంద్రం అడ్డం పడటంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒక దశలో సంక్షోభ పరిస్థితులను చవి చూసింది.
కేంద్రం రూపొందించిన పలు చట్టాలకు కేసీఆర్ సర్కారు ఇటీవలే ఆమోదం తెలపడంతో అధికారిక ప్రకటనేదీ లేకుండానే రాష్ట్రానికి కొత్త అప్పులు లభించడం మొదలైంది. అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా నిధులు సమీకరించుకున్న ప్రభుత్వం రెండు విడతల్లో వారం పది రోజుల వ్యవధిలో రైతుల ఖాతాలో నిధులు జమ చేయనుంది.
అయితే గతంలో మాదిరిగా రైతులు అందరికీ ఒకేసారి రైతు బంధు డబ్బులు వేయకుండా.. అందుబాటులో ఉన్న నిధులకు తగ్గట్టుగా అధికారులు డేటా డివైడ్ చేస్తున్నారు. మొదట ఎకరం, ఆ తర్వాతి రోజు రెండు ఎకరాలు, ఆ తర్వాత మూడు ఎకరాలు.. ఇలా పదెకరాల వరకు విడతల వారీగా నిధులు జమ చేస్తారు.





Untitled Document
Advertisements