ఎక్కువగా ఆలోచిస్తే మెదడు వేడెక్కుతుంటుందట..

     Written by : smtv Desk | Tue, Jun 21, 2022, 12:11 PM

ఎక్కువగా ఆలోచిస్తే మెదడు వేడెక్కుతుంటుందట..

ఏదైనా సంక్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు పరిష్కారాలు ఆలోచిస్తుంటే.. ‘మెదడు వేడెక్కిపోతోంది’అనడం మామూలే. అదేదో చమత్కారం కోసం అనే మాట కాదంటున్నారు నిపుణులు. చాలాసేపట్నుంచి వాడుతున్న ల్యాప్‌టాప్‌ లాగా, ఎంతోసేపట్నుంచి నడిచిన ఇంజన్‌ లాగే మెదడూ వేడెక్కుతుందంటున్నారు పరిశోధకులు. ఈ మెదడు వేడికీ, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కోలుకునే తీరుకు సంబంధం ఉందని గుర్తించడంతో.. దీనిపై ఇంకా ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి.
మామూలుగా మనుషుల నార్మల్‌ ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌. కానీ నిరంతరం మెదడు చేసే పనుల కారణంగా దాని ఉష్ణోగ్రత దాదాపు 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉంటుందని తేలింది. ఇలా జరగడం ఏ లోపాన్నీ సూచించదనీ, నిజానికి ఇదో ఆరోగ్యకరమైన సూచిక అని వెల్లడించారు. ఈ ఉష్ణోగ్రతను చూసి కొన్నిసార్లు పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు. ఉదాహరణకు.. ‘మెదడుకు ఏదైనా గాయమైనప్పుడు.. దాని కారణంగా ఇలా జరుగుతుందేమోనంటూ గతంలో ఇలాంటి ఉష్ణోగ్రతలను చూసినప్పుడు భావించేవారు. ఒకవేళ ఇదే ఉష్ణోగ్రత దేహంలోని ఏ భాగంలోనైనా నమోదైతే దాన్ని తప్పక జ్వరంగా పరిగణిస్తాం అని వ్యాఖ్యానించారు ఇంగ్లాండ్‌లోని మెడికల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ లాబోరేటరీ ఆఫ్‌ మాలెక్కులార్‌ బయాలజీకి చెందిన పరిశోధకుడు జాన్‌–ఓ–నీల్‌.
మెదడు ఉష్ణోగ్రతలను తెలుసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కొంతమంది వలంటీర్లపై ఈ పరిశోధనలు చేశారు. వీరంతా 20 - 40 ఏళ్ల మధ్యవారు. ఇలా కొలవడానికి ‘మాగ్నెటిక్‌ రెసోనెన్స్‌ స్పెక్ట్రోస్కోపీ (ఎమ్‌ఆర్‌ఎస్‌) అనే టెక్నిక్‌ను ఉపయోగించారు. అంతేకాదు.. ఈ డాటాను వారు సర్కేడియన్‌ రిథమ్‌తోనూ సరిపోల్చారు. ఉష్ణోగ్రత ఫలితాలనూ, సర్కేడియన్‌ రిథమ్‌తో పోల్చుతూ మరిన్ని అధ్యయనాలు జరుగుతున్నాయి.
మెదడు ఉష్ణోగ్రత ఎంత.. సాధారణంగా మెదడు ఉష్ణోగ్రత 101.3 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉంటుంది. ఇది నాలుక కింది ఉష్ణోగ్రత కంటే రెండు డిగ్రీలు ఎక్కువ. మళ్లీ ఈ కొలతల్లో కూడా వ్యక్తి వయసు, జెండర్, మహిళ అయితే రుతుసమయం.. ఇలాంటి అంశాలన్నీ బ్రెయిన్‌ టెంపరేచర్‌ను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించారు. కీలకమైన విషయం ఏమిటంటే.. పురుషుల మెదడు ఉష్ణోగ్రతల కంటే మహిళల్లో ఎక్కువ.
ఈ ఉష్ణోగ్రతలకూ.. ఏదైనా ప్రమాదం జరిగి మెదడుకు దెబ్బ (ట్రామాటిక్‌ బ్రెయిన్‌ ఇంజ్యూరీ) తగిలితే కోలుకునే తీరుకు సంబంధం ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ టెంపరేచర్‌ ఆధారంగానే ఇలా ప్రమాదం జరిగి కోలుకున్నాక.. భవిష్యత్తులో మెదడుకు రాబోయే ముప్పు వివరాలూ తెలుస్తాయనీ, అందుకే 24 గంటల పాటు ఉష్ణోగ్రత వివరాలతో మరిన్ని పరిశోధనలు జరగాలంటున్నారు మెడికల్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ లాబోరేటరీ ఆఫ్‌ మాలెక్కులార్‌ బయాలజీ విభాగంలోని న్యూరాలజిస్ట్‌ / మహిళా సైంటిస్ట్‌ నీనా జెకోర్జెక్‌.





Untitled Document
Advertisements