తెలంగాణ నిరుద్యోగులకు గ్రూప్-4 నోటిఫికేషన్

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 11:01 AM

తెలంగాణ నిరుద్యోగులకు గ్రూప్-4 నోటిఫికేషన్

తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడు ఎప్పుడా.. అని చూస్తున్న గ్రూప్-4 నోటిఫికేషన్ వివరాలు.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అధికారుల కసరత్తు తుది దశకు చేరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన కేసీఆర్ సర్కార్ ఈ మేరకు వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన 17 వేలకు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కు సంబంధించి 503 ఖాళీల భర్తీకి సైతం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సైతం ముగిసింది. టీచర్ ఉద్యోగాలకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. పరీక్ష సైతం ముగిసింది. మరో 4 రోజుల్లో ఇందుకు సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే.. గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి 9,618 ఖాళీల భర్తీకి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ అన్ని ఖాళీలకు సంబంధించి ఒకే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఇందుకు సంబంధిచిన ప్రతిపాదనల ఫైల్ ను సీఎం కేసీఆర్ వద్దకు ఇప్పటికే పంపించారు అధికారులు. గ్రూప్-4 కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉండడంతో క్షేత్ర స్థాయిలో పరిపాలనలకు ఇబ్బందులు ఏర్పాడుతున్నాయి.
దీంతో సాధ్యమైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ పోస్టుల భర్తీకి అవలంభించాల్సిన విధానంపై చర్చించారు. విద్యార్హతలు, ఇతర అంశాలపై సైతం చర్చించారు. ఈ అన్ని అంశాలపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్ ఆమోదానికి సంబంధిత ఫైల్ ను పంపించారు. సీఎం ఆమోదం లభించగానే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.





Untitled Document
Advertisements