మాట తప్పిన కేసీఆర్‌ ..

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 11:53 AM

మాట తప్పిన కేసీఆర్‌ ..

కన్నారం గ్రామంలోని వివిధ సర్వే నెంబర్ లో గల 211 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటాద్రి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో దేవులపల్లి సమ్మయ్యకు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు మూడు ఎకరాల సాగు భూమిని ఇస్తానని చెప్పి ఇవ్వకుండా దళితులను మోసం చేశారు అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి కట్టుకథలు అల్లడంలో కేసీఆర్‌ను మించిన వారు ఎవరూ లేరని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు భూ పంపిణీ చేయకుంటే దున్నేవాడిదే భూమి అనే నినాదంతో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో పేదలకు భూ పంపిణీ చేస్తామని తెలిపారు. కన్నారం గ్రామంలోని సర్వే నెంబర్ 30/2,48/2, 69,73,74/1,75,76/1,77,78/1,79,80,81, 192,197,124,207,123,125 లో గల 211 ఎకరాల ప్రభుత్వ భూమిని బీసీ, ఎస్సీ ఇతర కులాలకు చెందిన భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయాలన్నారు.
ఈ వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నా భూమి కొనుగోలు చేసేటంత ఆర్థిక స్తోమత లేని, సాగు చేసుకునేందుకు భూమిలేని పేద ప్రజలకు ప్రభుత్వ సీలింగ్, పంచరాయి భూములను సర్వే చేసి అర్హులైన వారికి పంచాలని తాసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఇలాంటి ప్రభుత్వ భూమి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం మండల కార్యదర్శి వెంకన్న, ఓపీడీఆర్ మండల కార్యదర్శి రవీందర్, యూసీసీఆర్ఐ జిల్లా కార్యదర్శి ఎం వీరస్వామి, మండల సహాయ కార్యదర్శి కాశి బోయిన ఎల్లయ్య, వడ్లూరి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.





Untitled Document
Advertisements