'నేను రాష్ట్రపతి రేసులో ఉండటం అనేది కేవలం వాట్సాప్‌లోనే జరిగింది' .. సుధామూర్తి

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 03:44 PM

'నేను రాష్ట్రపతి రేసులో ఉండటం అనేది కేవలం వాట్సాప్‌లోనే జరిగింది' .. సుధామూర్తి

ఇండియన్‌ ఐటీ ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చడంలో ఇతోధికంగా తోడ్పడిన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌ ఒకటి. నారాయణమూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్‌ దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా వెలుగొందుతోంది. ఇన్ఫోసిస్‌ ఎదుగుదల వెనుక ఫౌండర్‌ నారాయణమూర్తి శ్రమతోతో పాటు ఆయన భార్య సుధామూర్తి సహకారం కూడా ఉంది. రచయితగా, సామాజిక కార్యకర్తగా ఎప్పుడూ చురుగ్గా ఉండే సుధా నారాయణమూర్తికి ఆడియన్స్‌ నుంచి ఊహించిన ప్రశ్న ఎదురైంది. ఎంతో సున్నితమైన అంశం మీద ఎదురైన సవాల్‌కు ఆమె సూటిగా సుత్తి లేకుండా జవాబు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.సేవా కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరు పలు వాడల్లో పర్యటించారు సుధామూర్తి. ఈ సందర్భంగా సప్నా బుక్‌హౌజ్‌ను సందర్శించారు. అక్కడికి వచ్చిన పిల్లలు, పెద్దలు, స్థానికులతో కలిసి ముచ్చటించారు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండే మీరు రాష్ట్రపతి పదవి పోరులో ఎందుకు లేరంటూ స్థానికులు ప్రశ్నించారు. దీనిపై సుధామూర్తి స్పందిస్తూ.. ‘ నేను రాష్ట్రపతి రేసులో ఉండటం అనేది కేవలం వాట్సాప్‌లోనే జరిగింది. బయటెక్కడా అలాంటి ప్రయత్నాలు జరగలేదు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలోకి నన్ను లాగొద్దు’ అంటూ ఆమె బదులిచ్చారు.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవిండ్‌ పదవీ కాలం జులై 24తో ముగుస్తుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నికలు జులై 21న జరగబోతున్నాయి. అధికార పార్టీ తరఫున ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష పార్టీల తరఫున మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిన్హాలు బరిలో నిలిచారు. అయితే కర్నాటకలో మాత్రం రాష్ట్రపతి అభ్యర్థిగా సుధామూర్తిని ఎందుకు ప్రకటించరు అంటూ వాట్సాప్‌లో మేసేజ్‌లు జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి ప్రచారాలకు సుధామూర్తి నేరుగా సమాధానం ఇచ్చారు.





Untitled Document
Advertisements