తరచూ బొప్పాయి పండుని తింటే వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయట!

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 05:39 PM

తరచూ బొప్పాయి పండుని తింటే వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయట!

బొప్పాయి పండు మనందరికీ తెలుసు. మనలో చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇతర పండ్ల లాగా బొప్పాయి పండు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి పండును రోజూ తినడం వల్ల కంటిలో శుక్లాలు తొలగిపోయి కంటి చూపు మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
తరచూ బొప్పాయి పండును తింటూ ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, పలు రకాల క్యాన్సర్ లు రాకుండా ఉంటాయి. బొప్పాయి పండును తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఈ పండు ఎంతగానో దోహదపడుతుంది. తరచూ దీనిని తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. బరువు తగ్గడంలో కూడా బొప్పాయి పండు సహాయపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు పండిన బొప్పాయిని తినడం వలన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మానసిక ఆందోళనకు గురి అయినప్పుడు బొప్పాయి పండను తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
బొప్పాయి పండు యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బొప్పాయి పండును, గ్రీన్ టీ ని కలిపి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. డెంగ్యూ జ్వరం బారిన పడినప్పుడు బొప్పాయి పండును, బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి జార్‌లో వేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసి మిక్సీ పట్టి రసాన్ని తీసి దానికి తేనెను కలిపి తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.
ఈ సీజన్‌లో సహజంగానే చాలా మంది విష జ్వరాల బారిన పడుతుంటారు. కనుక ఈ సమయంలో బొప్పాయి పండును తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అలాగే ఈ సీజన్‌లో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. కనుక అలా కాకుండా ఉండాలంటే.. బొప్పాయి పండును తినాలి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన జీర్ణ వ్యవస్థలోని క్రిములను నాశనం చేస్తాయి. దీంతో రోగాల బారిన పడకుండా ఉంటాం. కనుక ఈ సమయంలో బొప్పాయి పండ్లను అసలు మిస్ చేసుకోకూడదు. తప్పనిసరిగా తినాలి.
కాలిన గాయాలపై బొప్పాయి పండు గుజ్జును ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. మనకు మేలు చేస్తుంది కదా అని దీనిని అధికంగా తినకూడదు. బొప్పాయి పండును అధికంగా తినడం వల్ల వేడి చేస్తుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఎట్టి పరిస్థితులలోనూ దీనిని తినరాదు. బొప్పాయి పండు కొందరిలో అలర్జీని కలిగిస్తుంది. అలాగే గుండె జబ్బులతో బాధపడే వారు దీనిని తినకపోవడమే మంచిది. అంతే కాకుండా ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కూడా దీనిని ఇవ్వకూడదు. ఈ విధంగా బొప్పాయి పండును తగిన మోతాదులో తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Untitled Document
Advertisements