ఒత్తిడి లేకుండా ఆడండి అని ప్రధాని మోడీ పిలుపు...

     Written by : smtv Desk | Thu, Jul 21, 2022, 04:53 PM

ఒత్తిడి లేకుండా ఆడండి అని  ప్రధాని మోడీ పిలుపు...

కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొని ఈస్థాయికి రావడంలో మీ పోరాటం, పట్టుదల ఎనలేనిదని ప్రధాని మోదీ కొనియాడారు. భారత బృందంతో ఆయన బుధవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ ఈనెల 28 నుంచి వచ్చేనెల 8 వరకు జరగనున్నాయి. 19 క్రీడాంశాల్లో 141 విభాగాల్లో మొత్తం 215 మందితో కూడిన భారత జట్టు పాల్గొంటోంది.
‘మీపై ఎలాంటి అంచనాలున్నాయనే విషయాన్ని పక్కకు పెట్టి.. అత్యుత్తమ ప్రదర్శన చేయడం పైనే దృష్టి సాదించండి . పతకాలు సాధించాలన్న ఒత్తిడి లేకుండా ఆడండి’ అని అథ్లెట్లకు ప్రధాని పిలుపునిచ్చారు. జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను గురించి క్రీడాకారులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. కామన్వెల్త్‌ క్రీడలు ముగిశాక అందరినీ కలుస్తానని, విజయోత్సవాన్ని ఆ సందర్భంగా జరుపుకొందామని ప్రధాని వారితో అన్నారు.
షర్మిల.. రోల్‌మోడల్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌ నుంచి వచ్చాక సహచరి గాయత్రీ గోపీచంద్‌తో ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటావని బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ క్రీడాకారిణి త్రీసా జోలిని ప్రధాని సరదాగా ప్రశ్నించారు. ‘ఒలింపిక్స్‌ తర్వాత ఐస్‌క్రీం తింటానని సింధు చెప్పింది. మరి కామన్వెల్త్‌ తర్వాత నీ ప్లాన్స్‌ ఏమిటి’ అని మోదీ నవ్వుతూ అడిగారు. 34 ఏళ్ల వయస్సులో క్రీడలను కెరీర్‌గా ఎంచుకొనేందుకు స్ఫూర్తని పారా షాట్‌పుటర్‌ షర్మిలను మోదీ అడిగారు. ‘నా తల్లి అంధురాలు. మేం నలుగురం సంతానం. చిన్న వయస్సులోనే వివాహమైంది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయితే ఇద్దరు పిల్లలు, నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. దాంతో తల్లిదండ్రులు నన్ను ఇంటికి తీసుకొచ్చేశారు. రెండో వివాహం తర్వాత బంధువు ఒకరు క్రీడల పట్ల నన్ను ప్రోత్సహించారు. అలా ఆటలో అడుగుపెట్టి జాతీయ పోటీలలో స్వర్ణం గెలిచా’ అని షర్మిల వివరించింది. షర్మిల కథతో ఉద్వేగానికిలోనైన ప్రధాని..ప్రతి ఒక్కరికీ ఆమె రోల్‌మోడల్‌గా నిలుస్తుందని కీర్తించారు.





Untitled Document
Advertisements